Amaravati Expansion: లక్ష ఎకరాల్లో అమరావతి నగరం..! మరో 44వేల ఎకరాల సమీకరణకు ప్రతిపాదన, ప్రస్తుతం 53వేల ఎకరాల్లో రాజధాని-amaravati city on one lakh acres proposal to acquire another 44 thousand acres ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Expansion: లక్ష ఎకరాల్లో అమరావతి నగరం..! మరో 44వేల ఎకరాల సమీకరణకు ప్రతిపాదన, ప్రస్తుతం 53వేల ఎకరాల్లో రాజధాని

Amaravati Expansion: లక్ష ఎకరాల్లో అమరావతి నగరం..! మరో 44వేల ఎకరాల సమీకరణకు ప్రతిపాదన, ప్రస్తుతం 53వేల ఎకరాల్లో రాజధాని

Sarath Chandra.B HT Telugu

Amaravati Expansion: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర పరిధి లక్ష ఎకరాలకు పెరగనుంది. ప్రస్తుతం ప్రభుత్వ భూములతో కలిసి 53వేల ఎకరాల్లో ఉన్న అమరావతి నగరాన్ని మరో 44వేల ఎకరాలు సమీకరించి లక్ష ఎకరాలకు పెంచే ప్రతిపాదనలు రెడీ అయ్యాయి.

అమరావతి నిర్మాణానికి మరో 44వేల ఎకరాల భూమి..

Amaravati Expansion: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర పరిధిని లక్ష ఎకరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం రైతులుే భూసమీకరణ ద్వారా ఇచ్చిన 34వేల ఎకరాల భూమితో పాటు ప్రభుత్వ భూములు కలిపి అమరావతిలో 53వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉండగా మరో 44వేల ఎకరానలు భూ సమీకరణలో సేకరించాలని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి కోసం 44,676 ఎక‌రాల భూమిని స‌మీక‌ర‌ణలో సేకరించాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. 2014-19 మధ్య కాలంలో 29 గ్రామాల్లో 34వేల ఎకరాలను రాజధాని కోసం సేకరించారు. ఈ భూమిలో తొలి దశలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. రాజధాని విస్తరణ, భవిష్యత్తు అవసరాల కోసం అమరావతిలో మరో 44వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మండలాల్లోనే భూ సమీకరణ..

తుళ్లూరు,అమ‌రావ‌తి,తాడికొండ‌,మంగ‌ళ‌గిరి మండ‌లాలోని గ్రామాల్లోని భూ స‌మీక‌ర‌ణ‌ చేపట్టనున్నారు. తూళ్లూరు మండ‌లంలోని హ‌రిచంద్రాపురం, వ‌డ్డ‌మాను,పెద‌ప‌రిమి గ్రామాల్లోని 9919 ఎక‌రాలు, అమ‌రావ‌తి మండ‌లంలోని వైకుంట‌పురం,ఎండ్రాయి,కార్ల‌పూడి,మొత్త‌డాక‌,నిడ‌ముక్క‌లా గ్రామాల‌లోని..12 ,838 ఎక‌రాల్లో భూమి, తాడికొండ‌లోని తాడికొండ‌, కంతేరు గ్రామాలలోని 16,463 ఎకరాలను భూ స‌మీక‌ర‌ణ ద్వారా సేక‌రించాలని ప్రతిపాదించారు. దీంతో పాటు మంగ‌ళ‌గిరిలోని కాజా గ్రామంలోని 4492 ఎక‌రాల‌ను భూ స‌మీక‌ర‌ణ ద్వారా సేకరిస్తారు.

సానుకూలంగా రైతులు…

భూ సమీకరణ విధానంలో ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు రైతులు సానుకూలంగా ఉండటంతో రెండు మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణ కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు సీఆర్డిఏ సిద్ధం అవుతోంది. భూసమీకరణ విధానంలో వ్యవసాయ భూముల్ని వదులుకుంటే వారికి రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయిస్తోంది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో ఉన్న భూములు కావడంతో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. దీంతో రాజధానిలో ప్రభుత్వానికి భూములు ఇవ్వడం లాభసాటిగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

భూ సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీకి రెడీ అయ్యింది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదలుపెట్టి దశలవారీగా భూ సమీకరణ చేయాలని భావిస్తున్నారు. కొన్ని గ్రామాల రైతులు పురపాలకశాఖ ముత్రి నారాయణను కలిసి తను భూములను సమీ కరణలో తీసుకోవాలని ఇప్పటికే నిజ్ఞప్తి చేశారు.

సీఆర్డీఏ వద్ద 2వేల ఎకరాల భూమి…

ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు కేటాయించగా సీఆర్డీఏ వద్ద రెండు వేల ఎకరాల భూమి మాత్రమే మిగులు తోంది. రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞపులు అందుతున్నాయని సిఆర్డీఏ చెబుతోంది. . అమరావతిలో అంతర్జాతీయ విమా నాశ్రయం ఏర్పాటు చేయడానికి 4వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేశారు.

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతికంగా ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏ డీసీ) ఇప్పటికే బెండర్లు పిలిచింది. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్, శిక్షణ కేంద్రాలతో కలిపి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచగా ఉంది. 

అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేపట్టడానికి భారీగా భూమి అవసరం కానుంది. అమరావతికి ఓ వైపు కృష్ణానది, మరో వైపు పాత గ్రాండ్ ట్రంక్‌ రోడ్డు హద్దులుగా ఉన్నాయి. తాజా భూ సమీకరణతో రాజధాని పరిధి దాదాపు లక్ష ఎకరాలకు చేరనుంది. భూమి కోసం పెట్టుబడి పెట్టకుండా సమీకరణ విధానంలో  రైతుల భాగస్వామ్యంలో  రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనతో అమరావతి నిర్మాణం 2014డిసెంబర్‌లో మొదలైంది. 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం