Amaravati Hudco Funds : రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్, రూ.11 వేల కోట్ల రుణంపై కీలక ఒప్పందం
Amaravati Hudco Funds : రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్ అందింది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన హడ్కో ఇవాళ సీఆర్డీఏతో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
Amaravati Hudco Funds : ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణం అందించనుంది.
జనవరి 22న ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతి రాజధానికి నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు నేడు సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏతో హడ్కో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో త్వరలో రాజధాని నిర్మాణ పనులకు నిధులు విడుదల కానున్నాయి. ఈ ఒప్పందం కోసం హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారాయణ, ఎంపీ బాలశౌరి ఘనస్వాగతం పలికారు.
గతేడాది సమావేశం
అమరావతికి రుణంపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠతో సమావేశమయ్యారు. రుణం మంజూరుపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగంపై మంత్రి నారాయణ హడ్కోకు వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అమరావతి రాజధాని పనులు స్పీడందుకున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే...జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది. ఒక్కొక్కటిగా రాజధాని పనులు చేపడుతున్నారు. కేంద్రం కూడా అమరావతికి ఆపన్నహస్తం అందిస్తుంది.
అమరావతి ఓఆర్ఆర్
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా అనుమతించాలని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు అనుమతించింది. కానీ భవిష్యత్ అవసరాలకు అది సరిపోదని.. గతంలో తాము కోరినట్లు 150 మీటర్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
అమరావతి రింగ్ రోడ్డు.. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 189.4 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌కు.. అప్రూవల్ కమిటీ డిసెంబరు 20న ప్రాథమిక ఆమోదం తెలిపింది. 70 మీటర్ల వెడల్పుతో.. 1,702 ఎకరాల మేర భూసేకరణకు మోర్త్ అనుమతించింది. నిర్మాణ వ్యయం, భూసేకరణ, ఇతర అనుమతులకు అయ్యే ఖర్చులు అన్నింటినీ కలిపి ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల 310 కోట్లుగా అంచనా వేసింది.
సంబంధిత కథనం