Amaravati Capital : అమరావతికి మరో గుడ్ న్యూస్, రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అనుమతి
Amaravati Capital : అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. ముంబయిలో జరిగిన సమావేశం హడ్కో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో నిధులతో అమరావతి నిర్మాణం మరింత వేగంపుంజుకుంటుందన్నారు.
Amaravati Capital : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబయిలో జరిగిన సమావేశంలో అమరావతికి రూ.11 వేల కోట్ల నిధులు విడుదలకు హడ్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామన్నారు. ఈ నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి తెలపడంతో అమరావతి పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

అమరావతికి రుణంపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమయ్యారు. రుణం మంజూరుపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగంపై మంత్రి నారాయణ హడ్కోకు వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అమరావతి రాజధాని పనులు స్పీడందుకున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే...జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది. ఒక్కొక్కటిగా రాజధాని పనులు చేపడుతున్నారు. కేంద్రం కూడా అమరావతికి ఆపన్నహస్తం అందిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో సైతం అమరావతి నిధులు కేటాయించింది.
రాజధాని అమరావతిలో పనులకు మరో ముందడుగు పడింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భారీ ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ త్వరలోనే శ్రీకారం చుడుతోంది. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. సచివాలయ టవర్లలో నీటి తోడడం తుది దశకు చేరుకుంది. రాఫ్ట్ పునాదులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంసీలను నియమించనున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. ఈ పనులకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేసిన అనంతరం క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ పీఎంసీలు నిర్వహిస్తుంటుంది.
అమరావతికి సంబంధించి మరో రూ.11 వేల కోట్ల పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. రాజధానిలో కీలకమైన సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఇవి భారీ ప్రాజెక్టులు కావటంతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్‌టెంట్లను నియమించనున్నారు.
బయటపడ్డ రాఫ్ట్ ఫౌండేషన్
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా సచివాలయ భవనాల నిర్మాణం కోసం భూమి లోపల రాతిఫలకాలను తాకుతూ ఏర్పాటు చేసిన రాఫ్ట్ ఫౌండేషన్ ఎట్టకేలకు బయట పడింది. దాదాపు ఐదేళ్లుగా ఈ పునాదులు నీటి ముంపులో ఉన్నాయి. 2018లో అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం కోసం పనుల్ని ప్రారంభించారు. భారీ ఎత్తున కాంక్రీట్ వినియోగంతో రాఫ్ట్ ఫౌండేషన్ పద్దతిలో పునాదులు తవ్వి నిర్మాణాలు చేపట్టారు. ఫౌండేషన్ పూర్తయ్యే దశలో 2019లో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత నేపథ్యంలో అమరావతి పనులు నిలిపివేశారు. దీంతో 2019 నుంచి దాదాపు ఐదున్నరేళ్లుగా ఈ పునాదుల్లో వర్షపు నీటిలో మునిగి పోయాయి. 2024లో ప్రభుత్వం మారిన వెంటనే పునాదుల పటిష్టతను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాదులు పరిశీలించి నిర్మాణాలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఆ తర్వాత సీఆర్‌డిఏ టెండర్లను ఖరారు చేసి నీటి తోడే ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 20 రోజులో భారీ మోటర్లతో ఫౌండేషన్లో నీటిని తొలగించే పనులు చేపట్టారు.
ఇటీవల అమరావతి ఐకానిక్ టవర్ల పునాదులు బయట పడ్డాయి. మొత్తం ఐదు టవర్లుగా ఈ నిర్మాణాలను చేపట్టారు. మొదటి రెండు టవర్ల వద్ద నీటిని దాదాపుగా బయటకు తోడేశారు. మిగిలిన టవర్ల వద్ద ఉన్న నీటని రెండు మూడు రోజుల్లో ఖాళీ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్ల పునాదుల్లో దాదాపు 16 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో నీరు చేరింది. నీటిని తోడేందుకు రూ. 88 లక్షలతో సీఆర్డీఏ పనులు అప్పగించింది. భారీ ఇంజెన్లు, ట్రాక్టర్లతో నీటిని బయటకు తోడేశారు. ఆదివారం ఈ టవర్లు పూర్తిగా బయట పడ్డాయి. ర్యాఫ్ట్ ఫౌండేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం