AP Rains : ఏపీపై ద్రోణి ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP Rains : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
AP Rains : ఏపీకి మరో రెండు రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గంగా పరివాహక ప్రాంతం, పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ఇప్పుడు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తువ వరకు విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం గుండా కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింత ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా కృష్ణానది వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులుగా ఉంది. వివిధ ప్రాజెక్టుల్లో దిగువకు వరద నీటి విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని కోరారు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణ పేట, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
గురు, శుక్రవారాల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు రోజులు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30-40 నుంచి కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.
సంబంధిత కథనం