Teachers On GO 117 : పాత పద్దతిలో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం, 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్-amaravati ap teachers unions demands govt to cancel 117 go on transfers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Teachers On Go 117 : పాత పద్దతిలో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం, 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్

Teachers On GO 117 : పాత పద్దతిలో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం, 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్

HT Telugu Desk HT Telugu
Aug 14, 2024 05:10 PM IST

Teachers On GO 117 : ఉపాధ్యాయుల సర్దుబాటు జీవో 117పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

పాత పద్దతిలో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం,117 జీవోను రద్దు చేయాలని డిమాండ్
పాత పద్దతిలో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం,117 జీవోను రద్దు చేయాలని డిమాండ్

Teachers On G.O 117 : రాష్ట్రంలో ఉపాధ్యాయుల సర్దుబాటు జీవో 117ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో పాత పద్ధతినే ప్రభుత్వం అనుసరిస్తోంది. గత ప్రభుత్వం తెచ్చిన జీవోనే అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు.‌ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ బిల్లు ఆమోదించారు. ఇలా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 117 తెచ్చింది. దీన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 117ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు‌. తీరా ఇప్పుడు అదే జీవో ఆధారంగా ఉపాధ్యాయులు మిగిలిపోయారని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. అందులో స్కూల్ అసిస్టెంట్లు 8,773 మంది, ఎస్జీటీలు 20,469 మంది, ఎయిడెడ్ లో 750 మంది ఉన్నారు. జిల్లాల వారీగా ఒక్క అనంతపురంలోనే 1,023 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 771 మంది ఎక్కువయ్యారని ప్రభుత్వం చెబుతోంది.‌ ఈ జీవో 117తో 12 వేల ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్‌ ఉన్నారు.‌ ఇప్పుడు కూడా అదే జీవో ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల మరో 4-5 వేల పాఠశాలలు సింగిల్ టీచర్‌గా మిగులుతాయని అంచనా. ఇంత భారీ సంఖ్యలో టీచర్లు మిగులు ఉంటే కొత్త వారి సంగతి ఏమిటీ? తొలి సంతకాల డీఎస్సీ ఏమవుతుంది? అనే అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయి.

రాష్ట్ర విద్యా శాఖ 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని నియమం తెచ్చింది. దీనివల్ల 4 నుంచి 5 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అవుతారు. అయితే ప్రాథమిక పాఠశాల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ని, ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక‌ టీచర్‌గా అయినా, లేకపోతే జీవో నెంబర్ 53 ప్రకారం అయినా ఈ ప్రక్రియ చేయపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అయితే మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ ఆగస్టు 15న సర్దుబాటు ప్రక్రియకు గడువు విధించింది. ఆగస్టు 16న మిగులు ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాను విడుదల చేస్తారు. ఆగస్టు 17న మండల స్థాయి సర్దుబాటు చేయనున్నారు.

117 జీవో రద్దుకు డిమాండ్

టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఉపాధ్యాయుల పని సర్దుబాటులో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.‌ ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై‌ తమతో విద్యా శాఖ అధికారులు వెబెక్స్ ద్వారా నిర్వహించారని, తాము కొన్ని అభ్యంతరాలు తెలిపామని ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్‌. చిరంజీవి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్.వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు జి. హృదయరాజు తెలిపారు. ‌తమ అభ్యంతరాలు పరిష్కరించిన తరువాతనే, ఉత్తర్వులు అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.

అయితే దీనికి భిన్నంగా ఏకపక్షంగా సర్దుబాటు ప్రక్రియ జరపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఫ్యాప్టోలో లేని పీఆర్టీయూ, ఆర్ యూపీపీ, ఎస్ఎల్టీఏ, ఏపీ పీఈటీ, ఎస్ఏ (పీడీ) తదితర సంఘాల మద్దతు ప్రకటించాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117, జీవో 128 ద్వారా కాకుండా 2020లో తీసుకొచ్చిన జీవో 53 ప్రకారం పని సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల ఉపాధ్యాయులంతా గందరగోళంలో పడ్డారని పేర్కొన్నారు.

జీవో 60 మేరకు పోస్టులు

పని సర్దుబాటు ప్రక్రియలో సీనియర్ కు విల్లింగ్ అవకాశాలు కల్పించాలని, సీనియార్టీని లెక్కించినప్పుడు ప్యానల్, ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల, డివిజన్ స్థాయి వరకే సర్దుబాటు పరిమితం చేయాలని అన్నారు. సొంత మేనేజ్‌మెంట్ ఖాళీల్లో భర్తీ చేసిన తరువాతనే ఇతర మేనేజ్‌మెంట్లలో నియమించాలని సూచించారు. 70 శాతం అంగవైకల్యం ఉన్నవారికి, వచ్చే ఏప్రిల్ నాటికి రిటైర్‌ అయ్యేవారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టులను విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కొనసాగించాలని కోరారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పది సెక్షన్లు దాటిన సందర్భంలో రెండో హిందీ, పీఎస్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు.‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జీవో 60 మేరకు ఎస్ఎ పోస్టులు కేటాయించాలని కోరారు.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం