AP Academic Calendar : ఏపీ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 82 రోజులు సెలవులు
AP Academic Calendar : ఏపీ విద్యాశాఖ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 233 పనిదినాలు ఉండగా, 82 రోజులు సెలవులుగా ప్రకటించారు.

AP Academic Calendar : ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 82 రోజులు సెలవులు ప్రకటించగా, 233 రోజులు పని దినాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఎన్ని రోజుల స్కూల్స్ పని చేస్తాయి అనేదాన్ని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 315 రోజులు కాగా, అందులో 233 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. అలాగే 82 రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
పాఠశాల పనివేళలు కూడా ప్రాథమిక పాఠశాలలకు ఒక షెడ్యూల్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఒక రకమైన షెడ్యూల్ ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉంటాయి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలకు, ఉన్నత పాఠశాలలకు ఒకే పని వేళలను ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు పనిచేస్తాయి. పాఠశాలల్లో టోఫెల్ తరగతుల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం టోఫెల్ తరగతులపై నిర్ణయం తీసుకోనుంది. టోఫెల్‌ను కొనసాగించాలా? వద్దా అనేది అధికారికంగా వెల్లడిస్తుంది.
విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ప్రకటించారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకం విధివిధానాలు రూపొందిస్తున్నామని, ఎంత మంది పిల్లులున్నా అందరికీ ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలతో 72 వేల మంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో విద్యా విధానాలపై అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని మంచి విధానాలను అమలు చేస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకంపై రాష్ట్రంలో వివిధ చర్చలు జరుగుతున్నాయి. అపోహలు పెరిగాయి. ఇటీవలి విడుదల చేసిన జీవో అందుకు కారణం అయింది. వెంటనే రాష్ట్ర విద్యాశాఖ కోన శశిధర్ స్పష్టత ఇచ్చారు.
తల్లికి వందనం పథకం కింద ఏడాది ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. ఈ మొత్తాన్ని తల్లి అకౌంట్‌లో నేరుగా వేస్తారు. అయితే గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకంగా అమలు చేసిన, ఈ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకంగా అమలు చేస్తుంది. గతంలో ఇంట్లో ఒక్క విద్యార్థికే రూ. 15 వేలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే, అంతమందికి కూడా ఇస్తామని ఎన్నికల సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే విద్యార్థులందరికీ వర్తింప చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం