AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ-amaravati ap rgukt iiit admissions 2024 notification released may 8th to june 25 apply ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rgukt Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2024 03:25 PM IST

AP RGUKT Admissions 2024 : ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

 ఏపీ ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ అడ్మిషన్లు
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ అడ్మిషన్లు

AP RGUKT Admissions 2024 : ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జూన్ 25 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి ప్రకటించారు. ఆర్జీయూకేటీ పరిధిలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు www.rgukt.in వెబ్ సైట్ లో మే 8 నుంచి జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. జులై 1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఆర్జీయూకేటీ వెబ్‌ సైట్‌ నుంచి విద్యార్థులు కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యత

ఏపీలోని మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 4400 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయిస్తాయి. వీటిల్లో ఏపీకి చెందిన విద్యార్థులకు ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 25 శాతం సూపర్‌ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. పదో తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే పీయూసీ కోర్సులకు ట్యూషన్‌ ఫీజు ఏడాది రూ.45 వేలు కాగా, బీటెక్‌ కోర్సుకు ఏడాదికి రూ.50 వేల చొప్పున ఫీజుల చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలక విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు కింద ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల

ఏపీ పీ ఈఏపీసెట్-2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో ఈఏపీ సెట్ 2024 హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణను ఈ ఏడాది జేఎన్‌టియూ కాకినాడ నిర్వహిస్తోంది. మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనుంది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ , అనుబంధ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తున్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేయడానికి ఈ లింకును అనుసరించండి.

ఏపీలోని కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్-2024కు 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది నిర్ణీత గడువులోగా 3,54,235మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఈఏపీ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు 2,68,309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు 84,791 మంది, రెండు విభాగాల్లో 1135 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈఏపీ సెట్‌(AP EAPCET Applications) దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.

Whats_app_banner

సంబంధిత కథనం