AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!
AP Weather Alert : ఏపీలో పోలింగ్ డే నాడు భిన్నమైన వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు పలు జిల్లాలో పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది.
AP Weather Alert : ఏపీలో సోమవారం పోలింగ్ డే. అయితే పోలింగ్ రోజున వాతావరణం పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రేపు(సోమవారం) కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటిచింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే ఓటర్లు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
రేపు(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. అలాగే పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు
ఎల్లుండి(మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
పలు ప్రాంతాల్లో వర్షాలు
ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 31.2 మిమీ, కోనసీమ జిల్లా ఆలమూరులో 30.2 మిమీ, తాటపూడిలో 28.7 మిమీ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 26 మిమీ, మన్యం జిల్లా పాచిపెంటలో 22, అనకాపల్లి జిల్లా పరవాడలో 21.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.
సోమవారం 18 మండలాల్లో వడగాల్పులు
మరోవైపు రేపు(సోమవారం) 18 మండలాల్లో వడగాల్పులతో పాటు మిగిలినచోట్ల ఎండ తీవ్రతగా ఉండే ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. విజయనగరం 8, పార్వతీపురంమన్యం 8, ఏలూరు భీమడోలు, కృష్ణా ఉయ్యూరులో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా గాజులపల్లెలో 41.9°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.4°C, ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో 41.3°C, కర్నూలు జిల్లా కామవరం, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 41.2°C, అనంతపురం జిల్లా కోమటికుంట్లలో 41°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండదెబ్బ తలగకుండా జాగ్రత్తలు
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
సంబంధిత కథనం