AP Inter Online Evaluation : ఇంట్లో నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం, ఈ సప్లిమెంటరీ నుంచే ఆన్ లైన్ విధానం
AP Inter Online Evaluation : ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకనం ఇకపై ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ విధానం అమలు చేయనున్నారు. ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో ఇంట్లో నుంచే పేపర్ల వాల్యూయేషన్ చేయనున్నారు.

AP Inter Online Evaluation : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ నూతన విధానం ప్రారంభం కానుంది. దీంతో అధ్యాపకులు సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని జవాబు పత్రాలు దిద్దే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఆన్‌లైన్ మూల్యాంకనం కోసం కర్నూలు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో ఆరు రీజియన్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు డివిజన్‌ను విశాఖ రీజియన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
ఇంట్లోనే జవాబుపత్రాల మూల్యాంకనం
ఈ రీజియన్‌కు సంబంధించి విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో స్కానింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 52 కంప్యూటర్ స్కానింగ్ మిషన్లతో పాటు అవసరమైన సామగ్రి సిద్ధం చేశారు. దీని పరిధిలోని జిల్లాల ఇంటర్ పరీక్షల జవాబుపత్రాలు ఈ సెంటర్‌కు వస్తాయి. 24 పేజీలు కలిగిన బుక్‌లెట్‌ను స్కానింగ్ చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. మూల్యాంకనం చేయబోయే అధ్యాపకులకు యూనిక్ కోడ్, పాస్‌వర్డ్ అందిస్తారు. వాటితో వారు లాగిన్ అయ్యి జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేయాలి. అధ్యాపకుడు తనకు నచ్చిన సమయంలో నచ్చినచోటి నుంచి జవాబుపత్రాలు దిద్దుకోవచ్చు. ఒక్కొక్కరు రోజుకు 30 పేపర్ల వరకు మూల్యాంకనం చేయాలి. దిద్దిన ప్రతి పేపర్‌కు రూ.23.69 చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ కొత్త విధానంపై ఇంకా పూర్తి అవగాహన లేదనే చెప్పాలి. అధ్యాపకులకు అవగాహన కల్పించి ఈ విధానం అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే గందరగోళం నెలకొనే పరిస్థితి వస్తుందని కొందరు భావిస్తున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
మరోవైపు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతున్నాయి. ఈ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,459 మంది రాస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 1,77,012 మంది బాలురు, 1,69,381 మంది బాలికలతో మొత్తం 3,46,393 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 67,129 మంది బాలురు, 54416 మంది బాలికలతో 1,21,545 మంది పరీక్షలు రాస్తున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో 9,499 బాలురు, 6,543 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,37,587మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లలో కలిపి 5,03,459 మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు