AP Anna Canteens : ఏపీలో 100 చోట్ల అన్న క్యాంటీన్లు, ఆగస్టు 15 నుంచి ప్రారంభం- ఉత్తర్వులు జారీ
AP Anna Canteens : ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15న రాష్ట్రంలోని 100 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
AP Anna Canteens : ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది. పేదలకు అతి తక్కువ ధరకు టిఫిన్, భోజనం అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తు్న్నట్లు ఇటీవల మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా అన్న క్యాంటీన్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. తొలి విడతలో భాగంగా 100 చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో 82, మూడో విడతలో 20 క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లకు హారేకృష్ణ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుంది. అన్న క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ తో పాటు భోజనం అందించనున్నారు.
203 అన్న క్యాంటీన్లు
రాష్ట్రంలోని 203 అన్న క్యాంటీన్ లను వంద రోజుల్లోగా తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇటీవల మంత్రి నారాయణ తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. గతంలో నిర్మాణం పూర్తయి చిన్నచిన్న రిపేర్లు ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అలాగే నిర్మాణాలు పూర్తి కావాల్సిన మరో 20 అన్న క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలన్నారు.
సెప్టెంబర్ 21 నాటికి
ఆగస్టు 10వ తేదీ లోపు క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్ వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అగస్టు 15 నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి, తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలని వంద రోజుల ప్రణాళికలో నిర్దేశించారు. సెప్టెంబరు 21 నాటికి పురపాలక, నగరపాలక సంస్థల్లో మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
పట్టణ పేదలకు పట్టెడన్నం
గత టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. పట్టణాలు, నగర ప్రాంతాల్లోని ఆసుపత్రులు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ....అన్న క్యాంటీన్లను మూసివేసింది. కొన్ని చోట్ల టీడీపీ నేతలు సొంత నిధులతో అన్న క్యాంటీన్లు నడిపారు. అన్న క్యాంటీన్లు మూసివేతపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. పట్టణాల్లో పేదలకు పట్టెడన్నం పెట్టే క్యాంటీన్లు మూసివేడడం ఎందుని, పేరు మార్చి కొనసాగించాలని కోరారు. అయితే వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల మూసివేతకే నిర్ణయించింది. 2024లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి టీడీపీ కూటమి... క్యాంటీన్లను ప్రారంభానికి కార్యాచరణ సిద్ధం చేశారు. ఆగస్టు 15న రాష్ట్రంలోని 100 ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభనున్నారు.
సంబంధిత కథనం