AP Assembly Session : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పటికే మంత్రులకు సైతం కేటాయించగా, మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. దీంతో ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 21వ తేదీన ప్రొటెం స్పీకర్ ఎంపిక, సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే ప్రొటెం స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లను ప్రొటెం స్పీకర్ గా నియమించారు. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఎల్లుండి నుంచి రెండురోజుల పాటు ప్రొటెం స్పీకర్ గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు చెప్పారు. జగన్ అయినా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాలని ఆశిస్తున్నానన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే కొత్త స్పీకర్ ఎవరనే చర్చ మొదలైంది. టీడీపీ నుంచి పలువురు సీనియర్ నేతలు స్పీకర్ పోస్టుకు పోటీపడుతున్నారు. కేబినెట్ లో స్థానం దక్కని పలువురు సీనియర్లు స్పీకర్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్పీకర్ పోస్టుపై చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. అలాగే చీఫ్ విప్ గా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సైతం స్పీకర్ పదవి ఆశించినట్లు తెలుస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం అయ్యన్నకే స్పీకర్ పదవి దక్కనుందని తెలుస్తోంది.
చింతకాయల అయ్యన్నపాత్రుడు...టీడీపీ సీనియర్ నేత. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న...ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన... యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఖాయం చేసినట్లు తెలుస్తోంది.