R5 Zone Houses: ఆర్5 జోన్ లబ్దిదారులకు ప్రత్యామ్నయ ఇళ్ల స్థలాలు, రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభం
R5 Zone Houses: అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కేటాయించిన ఆర్5 జోన్ లబ్దిదారులకు ప్రత్యామ్నయ స్థలాలను కేటాయించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
R5 Zone Houses: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేసిన భూముల్లో ఆర్ - 5 జోన్ పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలకు కేటాయింపుపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్5 జోన్‌లో ఇళ్ల స్థలాలను పొందిన వారికి సొంత ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఆర్ - 5 జోన్ లో గతంలో స్థలాలు పొందిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఆర్5 జోన్‌లో స్థలాలు పొందిన వారిని గుర్తించి.. వారివారి సొంత ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడం లేదా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు..సీఆర్డీఏలో లబ్దిదారులు ఉంటే వారికి అక్కడే ఇళ్లు కేటాయిస్తామన్నారు.
ముళ్ల కంపల తొలగింపు..
రాజధానిలో ముళ్ల పొదలను తొలగించే జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. వెలగపూడి లో భూమిపూజ చేసి మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో దట్టంగా పెరిగిపోయిన ముళ్ళపొదల తొలగింపు ముమ్మరం చేశారు. 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయనున్నారు. జగన్ రాజధానికి భూములిచ్చిన ప్రజలపై ద్వేషంతో, రాజధానిని నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు.
వైసీపీ నిర్లక్ష్యంతో 24, 230 ఎకరాలు చిట్టడవి అయ్యిందని, జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, . జగన్ ప్రజలపై వేసిన భారం ఇదన్నారు. రాజధాని కోసం తెచ్చిన మెటీరియల్ దొంగలపాలైందని, కొన్ని వేల కోట్లు ప్రజలపై జగన్ భారం పెట్టాడని ఆరోపించారు.
రాజధాని నిర్మాణం కోసం మొదట్లో 41 వేలకోట్లతో టెండర్లు వేశామని, వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడటంతో ఇక్కడి రోడ్లు త్రవ్వేసి ఈ ప్రాంతాన్ని అడవి చేశారన్నారు. మొత్తం 58 వేలఎకరాల్లో 24 వేల ఎకరాలు అడవి అయ్యిందని, 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తామన్నారు. వీలైనంత త్వరగా బిల్డింగ్స్, రోడ్లు పూర్తి చేస్తామని, ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చాక పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాజధాని కోసం పోరాటం చేసిన కౌలు రైతులకు మరో ఐదేళు కౌలు, రైతు కూలీలకు పెన్షన్ మరో ఐదేళ్లు పొడగిస్తున్నట్టు చెప్పారు.
భవన నిర్మాణాలకు అనుమతులు…
రాష్ట్రంలో లేఅవుట్లు,భవన నిర్మాణాలకు అనుమతులను నిబంధనలను సరళీకృతం చేస్తామని మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.ఇదే సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.
టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా నిబంధనల జారీని సరళీకృతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు మంత్రి నారాయణ..అనుమతుల విషయంలో ఇతర రాష్ట్రల్లో అమలవుతున్న నిబంధనలను అధ్యయనం చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అధికారుల బృందాలను పంపిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్దంగా కొంతమంది లేఅవుట్ల ను నిర్మిస్తున్నారని మంత్రి తెలిపారు..ఇలాంటి చోట్ల ప్లాట్లను కొనుగోలు చేయడం,భవన నిర్మాణాలు చేయడం ద్వారా ప్రజలు మోసపోతున్నారని చెప్పారు..అందుకే అనధికార లేఅవుట్ల సర్వే నెంబర్లను పేపర్ లు,టీవీల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు...ఆయా సర్వే నెంబర్లు రిజిస్ట్రార్ ఆఫీస్ కు ఇవ్వడం ద్వారా ప్లాట్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి పూర్తి వివరాలు తెలుస్తాయి..దీనికోసం రాబోయే మూడు నెలల్లో ప్రత్యేక వెబ్ సైట్ రూపకల్పన చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ.
ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభం…
ఈనెల 15 వ తేదీన రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది..దీనికి సంబంధించి ఆయా క్యాంటీన్ల భవనాల నిర్మాణాలు పనులు ఎంతమేరకు వచ్చాయి...కిచెన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ..ఈనెల పదో తేదీలోగా వంద క్యాంటీన్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు..రాబోయే వారం రోజుల పాటు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు..రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
మరో 83 క్యాంటీన్లు ఈనెలాఖరులోగా పూర్తిచేసేలా ముందుకెళ్లాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు...మరో 20 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు...అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాలు ఉంచే ప్రదేశం ఏర్పాటుతో పాటు నీటి సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలన్నారు..సర్వింగ్ టీమ్ తో ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకుంటూ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం సరఫరా చేసేలా చూడాలని సూచించారు.