రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ను కాపాడాలని అఖిలపక్షం పిలుపు, ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరణకు డిమాండ్‌-allparty call to save rural development trust demand revival of fcra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ను కాపాడాలని అఖిలపక్షం పిలుపు, ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరణకు డిమాండ్‌

రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ను కాపాడాలని అఖిలపక్షం పిలుపు, ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరణకు డిమాండ్‌

Sarath Chandra.B HT Telugu

ఉమ్మడి ఏపీలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన రూరల్‌ డెవలలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు విదేశీ నిధులు రాకుండా లైసెన్స్‌ రద్దు చేయడంపై అఖిలపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణల్లో ఏటా వందల కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆర్డీటీకి అనుమతులు మంజూరు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.

రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు ఎఫ్‌సిఆర్‌ఏ పునరుద్ధరణకు అఖిలపక్షం డిమాండ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోపేదల అభ్యున్నతి కోసం 56 ఏళ్లుగా కృషి చేస్తోన్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడంపై అఖిలపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. ఐదున్నర దశాబ్దాలుగా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.

విన్సెంట్‌ ఫెర్రర్‌ 1969లో అనంతపురంలో ప్రారంభించిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఏపీ, తెలంగాణల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏటా వందల కోట్ల రుపాయల విదేశీ నిధులతో స్వచ్ఛంధ సేవా కార్యక్రమాలను ఆర్డీటీ నిర్వహిస్తోంది. ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేయడంపై ఇటీవల అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జోక్యాన్ని సైతం కోరారు. రాయలసీమ వెనుకబాటు తనం, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం వంటి రంగాల్లో ఆర్డీటీ ఎనలేని కృషి చేసింది.

ఆర్డీటీకి ఎఫ్‌సిఆర్‌ఏ అనుమతులు రద్దు చేయడంతో అందులో పనిచేసే వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ జోక్యాన్ని కోరుతూ రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాశారు.

విజయవాడలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, సీనియర్ టిడిపి నేత వై .ప్రభాకర చౌదరి, కాంగ్రెస్ పార్టీ నేత కొరివి వినయ్ కుమార్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి ఆర్డీటీని కాపాడాలని పిలుపు నిచ్చారు.

విన్సెంట్ ఫెర్రర్ 1969లో అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు కుల,మత, వర్గ, రాజకీయాలకతీతంగా పనిచేస్తున్నారని గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా లక్షలాది కుటుంబాలకు విద్యా, వైద్యం, తాగునీరు, వైజ్ఞానిక అభివృద్ధి లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సీపీఐ రామకృష్ణ గుర్తు చేశారు.

బత్తులపల్లి ఆసుపత్రి కరోనా సమయంలో వేలాదిమంది ని బతికించిందని, ప్రతిభ గల విద్యార్థులకు ఆర్డిటి ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు. విన్సెంట్ ఫెర్రర్ కుటుంబం స్పెయిన్ నుంచి వచ్చినా భారతీయ పౌరసత్వం తీసుకొని తన కుమారుడు మంచూ ఫెర్రర్ వెనకబడిన వర్గాల హిందూ మహిళని వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారన్నారు.

ఎఫ్‌డిఐలకు ఆహ్వానం.. స్వచ్ఛంధ సేవలకు అడ్డంకులు..

అన్ని రాజకీయ పార్టీల,ప్రజా సంఘాల, మేధావుల తోడ్పాటుతో పేదరిక నిర్మూలన కు కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ కృషి చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒకవైపు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ మరోవైపు విదేశీ విరాళాలతో నడిచే సంస్థలను నిరోధించడం, దేశవ్యాప్తంగా 20,711 స్వచ్ఛంద సంస్థలను, ఆంధ్ర ప్రదేశ్ లో 622 స్వచ్ఛంద సంస్థలకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ను వినియోగించి విదేశీ విరాళాలను ఆపటం సహేతుకం కాదన్నారు.

కేంద్ర వైఖరి సరికాదు..

లౌకిక భావాలతో పేదరిక నిర్మూలన కోసం విదేశీ సంస్థల, వ్యక్తుల విరాళాలతో నడిచే సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వై. ప్రభాకర చౌదరి ప్రసంగిస్తూ ఆర్డిటి కులము, మతము లేవని, మదర్ థెరెసా ఆదర్శంగా తీసుకునిఅనంతపురం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.అనంతపురం జిల్లా ప్రజలందరూ ఆపదలో ఉన్న ఆర్టిటి కి అండగా ఏకతాటిపై నిలబడటం గర్వంగా ఉందన్నారు.

ఆర్డీటీ దేశంలోనే మొదటిసారిగా పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిందని, ప్రతిభగల విద్యార్థులకు పారితోషకాలు, అందించిందని గుర్తు చేశారు. ఆర్డీటీ ఎంతో పారదర్శకంగా పనిచేస్తుందని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఎవరికి ఎవరని, ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీని ప్రోత్సహించదని, పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తుందన్నారు.

ఏపీ తెలంగాణల్లో సేవా కార్యక్రమాలు..

ఆర్డీటీ 3,877 గ్రామాల్లో పనిచేస్తుందని తెలంగాణలో నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలో సేవా కార్యక్రమాలతో విస్తరించిందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి వివరించారు.

పీ4 ఆలోచనను 50 సంవత్సరాల క్రితం నుండి అమలు చేస్తుందని అలాంటి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన మహత్తర బాధ్యత నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉందన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం