AP Liquor Problems 2024 : లిక్కర్ వ్యాపారులకు 'తమ్ముళ్ల' వార్నింగ్.. ఇస్తే వాటా.. లేకపోతే టాటా!-alliance leaders warning to liquor traders in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Problems 2024 : లిక్కర్ వ్యాపారులకు 'తమ్ముళ్ల' వార్నింగ్.. ఇస్తే వాటా.. లేకపోతే టాటా!

AP Liquor Problems 2024 : లిక్కర్ వ్యాపారులకు 'తమ్ముళ్ల' వార్నింగ్.. ఇస్తే వాటా.. లేకపోతే టాటా!

Basani Shiva Kumar HT Telugu
Published Oct 18, 2024 02:40 PM IST

AP Liquor Problems 2024 : గతంలో లేని విధంగా.. ఇతర రాష్ట్రాల వారికి కూడా వైన్ షాపుల కోసం టెండర్లు వేసే అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కొన్ని చోట్ల వారు షాపులు దక్కించుకున్నారు. కానీ.. ఓపెన్ చేయడం కష్టంగా మారింది. అటు లోకల్ వాళ్లకు వచ్చినా.. కూటమి నేతల నుంచి బెదిరింపులు తప్పడం లేదనే విమర్శలున్నాయి.

లిక్కర్ వ్యాపారులకు వార్నింగ్
లిక్కర్ వ్యాపారులకు వార్నింగ్ (istockphoto)

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని రోజులూ.. వైన్ ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠగా ఎదురుచూశారు. లాటరీ ప్రక్రియలో షాపులు కేటాయింపు పూర్తయ్యాక.. వచ్చిన వారు ఆనందంగా.. రానివారు బాధగా కనిపించారు. కానీ.. అక్కడితోని వదిలేయలేదు. షాపులు దక్కని వారు కొత్త దందాకు తెరతీశారు. స్థానిక అధికార పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లి.. షాపులు దక్కించుకున్న వారికి దంకీ ఇస్తున్నారు. దీంతో దాదాపు 50 శాతం వరకు మద్యం షాపులు ప్రారంభం కాలేదని తెలుస్తోంది.

ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాను తీసుకుంటే.. దుకాణాల ఏర్పాటు నుంచే బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో బరితెగించారు. ముందుగానే టెండర్ చేయవద్దని హెచ్చరించిన లీడర్లు.. తమ వ్యాపారులను సిండికేట్‌ చేయించి దరఖాస్తులు చేయించారు. వారికి లాటరీలో దుకాణాలు రాకపోవడంతో.. వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.

4 నియోజకవర్గాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అడిగినంత వాటా ఇవ్వకపోతే.. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయినా ముందుకెళ్లి షాపులు ఓపెన్ చేస్తే.. బెల్ట్ షాపులు తమవాళ్లకే ఇవ్వాలని కండీషన్లు పెడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఈ దందా నడుస్తోంది.

మద్యం షాపులను అమ్మేస్తున్నారు..

తెలంగాణ సరిహద్దులో ఉన్న షాపుల్లో వ్యాపారం జోరుగా సాగుతుందని చాలామంది ఆశించి టెండర్లు వేశారు. ఇక్కడ తక్కువ ధరలకు మద్యం లభిస్తుందని.. దాన్ని తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకోవచ్చని అనుకున్నారు. అది కుదరడ లేదు. ఇటు దంకీలు ఎక్కువయ్యాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో షాపులు దక్కించుకున్న చాలామంది.. స్థానిక సిండికేట్‌లకు అమ్మేస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్మెసి హమ్మయ్య అనుంకుటున్నారు.

దాడులకూ వెనకాడటం లేదు..

అనంతపురం జిల్లా ధర్మవరంలో కూటమి నేతలకు కాకుండా వేరే వారికి వైన్ షాప్ దక్కింది. దాన్ని తమకు ఇచ్చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. అందుకు షాప్‌ను దక్కించుకున్న వారు ఒప్పుకోలేదు. దీంతో రాత్రికి రాత్రే దాడికి తెగబడ్డారు. మద్యం దుకాణం ప్రారంభం అయిన రోజు వచ్చిన స్టాక్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్‌ను పగలగొట్టారు.

చంద్రబాబు వార్నింగ్..

మద్యం, ఇసుక వ్యవహారంలో కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు వెనక్కి తగ్గారు. కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం అస్సలు తగ్గడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే వాదన వినిపిస్తోంది.

Whats_app_banner