Allavaram Rajula Saare : అల్లవరం రాజుల సారె వరల్డ్ ఫేమస్- గోదావరి జిల్లాల స్పెషల్ స్వీట్లు
Allavaram Rajula Saare : ఆయ్.. గోదారోళ్లంటే మమూలుగా ఉండదండోయ్. ఆడబిడ్డను అత్తింటికి పంపుతున్నప్పుడు పదుల రకాల స్వీట్లు, హాట్ పదార్థాలతో సారె పంపుతారు. ఈ సారె తయారీకి అల్లవరం గ్రామానికి పెట్టింది పేరు. ఇక అల్లవరం రాజుల సారె అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండోయ్.
హిందూ సంప్రదాయాల్లో 'సారె' కు ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పెళ్లి సారె, పురిటి సారెకు ప్రాధాన్యత ఉంటుంది. తమకు కలిగిన విధంగా పుట్టింటి సారె పెట్టి ఆడబిడ్డను అత్తింటికి పంపుతారు. అయితే ఈ సారె తయారీకి కోనసీమ జిల్లా అల్లవరం గ్రామం పెట్టింది పేరు. అల్లవరం 'రాజుల సారె' అంటే గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. రాజుల సారెలో పదుల సంఖ్యలో స్వీట్లు ఉంటాయి. సాధారణంగా పెళ్లి సారెలో 9 రకాల స్వీట్లు, పురిటి సారెలో 30-40 రకాలు స్వీట్లు పంపుతారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
అల్లవరం రాజుల సారె
అల్లవరం గ్రామం అమలాపురం గ్రామానికి 10 కి.మీ దూరంలో, రాజమండ్రికి 70 కి.మీ దూరంలో ఉంది. అల్లవరం రాజుల సారెలో బెల్లం మిఠాయి(కరకజ్జం), మల్లారపు ఉండ, జాంగ్రి, లడ్డు, తొక్కుడు లడ్డు, చంద్రవంక, మైసూరు పాకం, కాజా, పంచదార గోరుమిఠాయి, గజ్జికాయలు, పల్లీ ఉండలు, సున్నండలు, జీడులు, పంచదార చిలకలు, పూతరేకులు, పాలకోవ, పీచుమిఠాయి, పాలబంతి... ఇలా పలు రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. అల్లవరం మల్లారపు ఉండలు మరీ ఫేమస్, వీటిని చాలా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేస్తుంటారు. స్వీట్లతో పాటు హాట్ అండ్ చిప్స్ కు కూడా భలే గిరాకీ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మురుకులు, చెగోడీలు, ఇతర హాట్ ఐటమ్స్ ప్రత్యేకమైన ఆర్డర్స్ పై తయారు చేయించుకుంటుంటారు.
కిలో రూ.140 మాత్రమే
కేజీల లెక్కలో ఆర్డర్స్ తీసుకుని రోజుల వ్యవధిలో తయారుచేస్తారు. సాధారణంగా కేజీ స్వీట్ రూ.140 చొప్పున తీసుకుంటారు. ప్రతీ స్వీట్ కు ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి అందిస్తుంటారు. ఆర్డర్ ఇచ్చిన రెండు రోజుల్లో స్వీట్ అండ్ హాట్ తయారు చేసి అందిస్తుంటారు. అన్ని శుభకార్యాలకు ప్రత్యేకమైన స్వీట్లు తయారు చేసి అందిస్తుంటారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్డర్స్ వస్తుంటాయని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు.
సంక్రాంతికి గిరాకీ ఎక్కువ
వినాయక చవితికి పెట్టే లడ్డులను ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అల్లవరం నుంచి హైదరాబాద్ కు లడ్డులు సరఫరా చేస్తుంటారు. సంక్రాంతి సమయంలో తమ స్వీట్లకు బాగా గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సంక్రాంతికి సొంత గ్రామానికి వస్తుంటారు. వారు తిరిగి వెళ్లేటప్పుడు అల్లవరం స్వీట్లు, హాట్స్ తీసుకెళ్తుంటారు. అల్లవరంలో తయారుచేసే స్వీట్లు, హాట్స్ ఎంతో క్వాలిటీతో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయని అంటున్నారు. సంక్రాంతి సమయంలో అరిసెలు, పోకుండలు, జంతికలు, పూతరేకులకు గిరాకీ ఉంటుందని తెలిపారు. అతి తక్కువ ధరలో నాణ్యమైన స్వీట్లు అందించడంతో అల్లవరం సారె బాగా ఫేమస్ అయ్యిందని స్థానికులు అంటున్నారు. స్వీట్లు, హాట్ పదార్థాలు తయారుచేస్తూ గ్రామంలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
సంబంధిత కథనం