AP Pensions : బోగస్ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం...! మార్గదర్శకాలు జారీ, వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే..?
ఏపీలో బోగస్ పింఛన్ల ఏరివేత ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్లలో అనర్హలు ఎక్కువగా ఉన్నట్లు తేలటంతో… రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
రాష్ట్రంలో వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్స్‌లో అనర్హత పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సాధ్యమైనంత మేరకు త్వరగా పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి అవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారుల పని విభజన చేస్తూ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ విడుదల చేశారు.
సర్టిఫికెట్ల జారీ నిలిపివేత….
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ల పెంపు చేసింది. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులు, వికలాంగుల పెన్షన్లను భారీగా పెంచింది. నెలకు రూ.3000 ఉన్న వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు పెన్షన్ కూడా రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచింది. భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆయా కేటగిరీల్లో అనర్హత పెన్షన్ల ఎరివేతకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవరకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది.
రాష్ట్రంలో నకిలీ వికలాంగు ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
అనర్హులు వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య, వికలాంగుల పింఛన్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన అధిక సంఖ్యలో అనర్హుల పింఛన్‌లను గుర్తించినట్లు మార్గదర్శకాలు విడుదల చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) ముఖ్య కార్యనిర్వహణాధికారి నివేదించిన ప్రతిపాదనను నిశితంగా పరిశీలించిన తరువాత, ఆరోగ్యం (దీర్ఘకాలిక వ్యాధులు), వికలాంగుల పెన్షన్‌ల వెరిఫికేషన్ (ధృవీకరణ)/ రీ అసెస్‌మెంట్ (పునఃమూల్యాంకనం) కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆరోగ్య పెన్షన్లు
1. పక్షవాతం వ్యక్తిని చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం.
2. తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులు
3. మల్టీడిఫార్మిటీ లెప్రసీ
వికలాంగ పెన్షన్లు
1. లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్
2. దృష్టి లోపం
3. వినికిడి లోపం
4. మెంటల్ రిటార్డేషన్
5. మానసిక అనారోగ్యం
6. మల్టీపుల్ డిజిబులిటీ
సెర్ప్ పర్యవేక్షణలో వెరిఫికేషన్
పెన్షన్స్ వెరిఫికేషన్ ప్రక్రియను సెర్ప్ పర్యవేక్షిస్తుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయం చేస్తుంది. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియ రోల్ అవుట్, డిజిటల్ అప్లికేషన్‌పై అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. దీనివల్ల వెరిఫికేషన్/రీఅసెస్‌మెంట్ పురోగతిని పర్యవేక్షిస్తుంది. అనంతరం ప్రభుత్వానికి సెర్ప్ నివేదికను సమర్పిస్తుంది. హెల్త్ డిపార్ట్‌మెంట్ వెరిఫికేషన్ కోసం డాక్టర్లను అందిస్తుంది. అందుకనుగుణంగా వైద్యులకు శిక్షణ ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది.
జిల్లా స్థాయి సమన్వయ కమిటీ
పెన్షన్ల వెరిఫికేషన్ కోసం జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్‌గా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. ఆ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో), జిల్లా హాస్పటిల్ సర్వీస్ కోఆర్డినేటర్, జిల్లా లెప్రసీ ఆఫీసర్, జిల్లా పంచాయత్ ఆఫీసర్, జిల్లా పరిషత్ సీఈవో, జీఎస్‌డబ్ల్యూఎస్ డిపార్టమెంట్ జిల్లా కోఆర్డినేటర్, మున్సిపల్ కమిషనర్స్, పోలీసు డిపార్టమెంట్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
వెరిఫికేషన్ ఎలా చేస్తారు?
వెరిఫికేషన్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి వైద్య బృందం ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేయడం, రెండోది హాస్పటిల్‌లో వెరిఫికేషన్ చేయడం. రాష్ట్రంలో మొత్తం దీర్ఘకాలిక వ్యాధులు, దివ్యాంగు పెన్షనర్లు 8,18,900 మంది ఉన్నారు. వీరిలో దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు 30,924 మంది కాగా, దివ్యాంగు పెన్షనర్లు 7,87,976 మంది ఉన్నారు.
1. ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్: పక్షవాతం వ్యక్తిని చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం (16,479 మంది పెన్షనర్లు), తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధిత (7,612 మంది) పెన్షనర్ల ఇంటింటికి వెళ్లి వైద్య బృందం వెరిఫికేషన్ చేస్తుంది. నెలకు రూ.15,000 పెన్షన్ అందుకుంటున్న 24,091 మంది పెన్షనర్ల ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేస్తారు.
2. ఆసుత్రుల్లో వెరిఫికేషన్ : రూ. 6,000 పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగుల పెన్షనర్లకు వైద్య బృందం వెరిఫికేషన్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో నిర్వహిస్తారు. లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ (4,63,425), దృష్టి లోపం (90,302), వినికిడి లోపం (1,09,232), మెంటల్ రిటార్డేషన్ (1,03,042), మానసిక అనారోగ్యం (19,193), మల్లీపుల్ డిజిబులిటీ (2,782) మంది పెన్షనర్లు ఉన్నారు. అలాగే మల్టీడిఫార్మిటీ లెప్రసీ (6,833) మంది పెన్షనర్లు ఉన్నారు. ఆర్థోపెడిక్స్, సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేస్తారు.
ప్రతి మెడికల్ టీంతో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్ జత చేస్తారు. జిల్లా స్థాయిలోషెడ్యూల్‌ను జిల్లా స్థాయి సమన్వయ కమిటీ రూపొందిస్తుంది. మండల, మున్సిపాలటీ స్థాయిల్లో షెడ్యూల్‌ను రూపొందిస్తారు. మెడికల్ టీంను కూడా జిల్లాస్థాయి సమన్వయ కమిటీనే నియమిస్తుంది. ఒక మెడికల్ టీం ప్రతి రోజు కనీసం 25 పెన్షనర్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా షెడ్యూల్‌ను తయారు చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. తేదీలువారీ ఆయా పెన్షనర్ల మ్యాపింగ్ జరిగేలా చూసుకోవల్సిన బాధ్యత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లదే. పెన్షన్స్‌ను మొబైల్ అప్లికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన పెన్షన్లలలో 5 శాతం ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఒక టీంను ఏర్పాటు చేస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం