తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ!-alert to tirumala devotees ttd gives clarity on senior citizen and phc darshan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ!

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ!

Anand Sai HT Telugu

సీనియర్ సిటిజన్ల దర్శనంపై టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మెుద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

టీటీడీ అప్డేట్

సీనియర్ సిటిజన్ల దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ స్పందించింది. వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మకూడదని శ్రీవారికి భక్తులకు దేవస్థానం తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని ప్రకటన విడుదల చేసింది.

రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తుందని తెలిపింది. టికెట్ తీసుకున్న వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుందని పేర్కొంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్, పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది. సామాజిక మధ్యమాల్లో వచ్చే వార్తలు, వదంతులు నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం పొందడానికి భక్తులు టీటీడీ అధికార వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని ప్రకటనలో తెలిపింది.

మరో ప్రచారాన్ని కూడా టీటీడీ ఖండించింది. తిరుమలకు వెళ్తున్న భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. అలిపిరి మెట్ల మార్గం దగ్గర మద్యం తాగి మత్తులో మందుబాబులు సీసాలను పగులగొట్టి వేస్తున్నట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని టీటీడీ తెలిపింది. అలిపిరి నుంచి రుయా ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలు రోడ్డుపై విసిరి వేశారంది.

నిజానికి అది టీటీడీ రహదారి కాదని స్పష్టం చేసింది. అయితే కొందరు అలిపిరి మెట్ల మార్గం దగ్గర భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని వక్రీకరిస్తున్నారని మండిపడింది. తప్పుడు వార్తలను నమ్మెుద్దని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అక్టోబ‌ర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌ర్‌ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాలను టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో

అక్టోబర్ 06న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో శ్రీ సుందరరాజ స్వామి వారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో

అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో

అక్టోబర్ 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు.

శ్రీనివాస స్వామి ఆలయం, తిరుచానూరు

అక్టోబర్ 11, 18, 25 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

అక్టోబరు 10, 17, 24, 31 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు అభిషేకం, వస్త్రలంకారణ సేవ ఉంటుంది.

అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం.

అక్టోబర్ 7న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

అక్టోబర్ 12, 19, 26 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.