RationCards EKYC: రేషన్ కార్డుదారులంతా ఈనెలాఖరు లోగా ఈకేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈకేవైసీ పూర్తి చేయాలని మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నెలాఖరు లోగా ఈకేవైసీని పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో)లకు ఆదేశించారు.
ఈ-పోస్ పరికరాలు, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ మొబైల్ యాప్ ద్వారా రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీని మార్చి 31 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్నవారికి అవసరం లేదు. ఇంకా ఈకేవైసీ చేసుకోలేని వారికి చేయాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వలస కార్మికుల సమస్యలు, కష్టాలకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చి తీర్పు మేరకు ఈ మార్గదర్శకాలు ఇస్తున్నామని తెలిపారు. మార్చి 31లోగా రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో)లకు సూచించారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసేందుకు ఈ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
1. ఎఫ్‌పీ షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, డీసీఎస్‌వో లాగిన్, కలెక్టర్ లాగిన్‌లలో ఈకేవైసీపీ యూనిట్లు అందుబాటులో ఉంచారు.
2. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీఎస్‌డబ్ల్యూఎస్) మొబైల్ యాప్, ఎఫ్‌పీ షాపుల్లో ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించాం.
3. అందువల్ల, అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో)లు ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని సూచించారు.
లబ్ధిదారులు (5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా) గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం మొబైల్ యాప్ లేదా ఈ-పీవోఎస్ పరికరాల ద్వారా ఈకేవైసీపీ ప్రక్రియను మార్చి 31లోపు పూర్తి చేయాలన్నది లక్ష్యమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా చేయకపోతే, కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అయితే ఇప్పటి వరకు కార్డుదారులకు ఈకేవైసీ లేకపోయినా రేషన్ సరుకులు ఇచ్చేవారు. ఇకపై అలా కుదరదని, నమోదు చేసుకోనివారికి రేషన్ బంద్ అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఐదేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసున్న వారంతా రేషన్ షాప్‌లకు వెళ్ల ఈ-పోస్‌పై వేలిముద్ర వేస్తే డీలర్ లాగిన్‌లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం జాతీయ సమాచార సంస్థ (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. అందులో భాగంగానే ఈకేవైసీని అప్‌డేట్ నిర్వహిస్తామన్నారు.
స్వగ్రామాలకు దూరంగా ఉన్నవారు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. రేషణ దుకాణాలతోపాటు మీసేవ, ఆధార్ కేంద్రాల్లోనూ కూడా ఈకేవైసీని నమోదు చేసుకోవచ్చు. చిన్నారులకు సంబంధించి ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో వలస కార్మికులు చాలా మంది ఈకేవైసీ నమోదు చేసుకోవటం లేదు.
ఈకేవైసీ చేయించుకోలేని వారిలో అంతరాష్ట్ర, అంతర్ జిల్లాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఉన్నారు. వారు పని చేసే ప్రాంతంలో ఈకేవైసీ చేయించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వారికి సమాచారం ఇచ్చి ఈకేవైసీ చేయించుకునే చేస్తే వంద శాతం ఈకేవైసీ పూర్తి అవుతుంది. లేకపోతే చాలా మంది ఈకేవైసీ చేయించుకోకపోవడంతో రేషన్‌కు దూరం అవుతారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం