అనంతపురం జిల్లాలో ఘోరం.. మద్యానికి బానిసై మతిస్థిమితం లేని కన్న కూతురిపై అత్యాచారం
అనంతపురం జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసై ఒక తండ్రి మతిస్థిమితం లేని కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్య తన కుమార్తెతో కలిసి అనంతపురం దిశ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా బయట పడింది. ఆ గ్రామానికి చెందిన వ్యక్తికి ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. మేనరికం కావడంతో పిల్లలు ముగ్గురూ మానసిక వైకల్యంతో జన్మించారు.
వీరి పోషణ, ఆలన, పాలన చూడటం కష్టం సాధ్యంగా మారింది. మరోవైపు ఇంటి పెద్దదిక్కుగా ఉండే తండ్రి మద్యానికి బానిసవ్వడం ఆ కుటుంబానికి మరింత భారమైంది. దీంతో చిన్నమ్మాయిని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో చేర్పించారు. అక్కడ చిన్నారి చదువుతోంది. ప్రభుత్వం వికలాంగ పింఛను తీసుకునేందుకు ప్రతినెలా ఆ బాలికను ఆమె తల్లి ఇంటికి తీసుకొచ్చేది. మద్యానికి బానిసైన కన్నతండ్రి ఆ చిన్నారిపై కన్న కూతురని కూడా చూడకుండా కన్నేశాడు.
కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన తండ్రే ఆ చిన్నారి పాలిట కీచకుడిగా మారాడు. మతి స్థిమితం లేని ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొన్ని నెలలుగా తన వికృత చేష్టలతో ఆ చిన్నారిని లైంగికంగా వేధించేవాడు. ఈనెల మొదటి వారంలో ఇంటికి వచ్చిన కుమార్తెతో తన పశువాంఛను తీర్చుకున్నాడు. అడ్డుపడిన భార్యపై దాడి చేసి చంపుతానని బెదిరించాడు.
కానీ దుర్మార్గుడి ఆగడాలను భరించలేక భార్య, తన కుమార్తెతో కలిసి శనివారం సాయంత్రం అనంతపురం దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తారు. అనంతపురం అర్బన్ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు