Ajeya Kallam: సిబిఐ పేరుతో దుష్ప్రచారం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదన్న అజేయ కల్లం-ajeya kallam questioned why the cbi did not stop the false stories ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ajeya Kallam Questioned Why The Cbi Did Not Stop The False Stories

Ajeya Kallam: సిబిఐ పేరుతో దుష్ప్రచారం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదన్న అజేయ కల్లం

B.S.Chandra HT Telugu
May 18, 2023 11:39 AM IST

Ajeya Kallam: వివేకా హత్య కేసులో సిబిఐ పేరుతో పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ప్రభుత్వ కార్యదర్శి అజేయ కల్లం ఆరోపించారు. వివేకా హత్య కేసు వివరాల కోసం సిబిఐ అధికారి తనను వచ్చి కలిశారని, పత్రికల్లో లేనిపోని అవాస్తవాలతో కథనాలు రాశారని ఆరోపించారు.

ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం
ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం

Ajeya Kallam: వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ దర్యాప్తు బృందం తనను విచారణకు పిలిచిందనే వార్తల్ని ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లం తోసిపుచ్చారు. విచారణలో భాగంగా దర్యాప్తు బృందంలోని అధికారి తనను, ఇంటి దగ్గర కలిశారని వివరించారు. వివేకా మరణం గురించి తనకు తెలిసిన సమాచారాన్ని సిబిఐకు తెెలియచేశానని, ఈ విషయంలో కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు వెలువడ్డాయని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

తనను విచారణ కోసం సిబిఐ పిలవలేదని, తన ఇంటికి సిబిఐ ఎస్పీ తన అనుమతి తీసుకుని వచ్చారని, దర్యాప్తు అధికారి వచ్చిన విషయం తమ ఇద్దరికి తప్ప మూడో వారికి తెలియదన్నారు. తాను చెప్పకుండా, సిబిఐ అధికారి చెప్పకుండా పత్రికల్లో కథనాలు ఎలా వస్తాయన్నారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలను కూడా పరిశీలిస్తున్నట్లు అజేయ కల్లాం చెప్పారు.

వివేకానంద రెడ్డి చనిపోయిన సమయంలో ముఖ్యమంత్రి తమతో వివేకాఃనందరెడ్డి ఈజ్ నో మోర్ అని మాత్రమే తమతో చెప్పారని, హార్ట్అటాక్ అని, ఇంకో మాట ఏది సిఎం తమతో చెప్పలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సిబిఐకు తాను చెప్పానని వివరించారు.

ఎన్నికలకు ముందు ఫలానా రోజు సమావేశం జరిగిందని, గంటా గంటన్నర పాటు సమావేశం జరిగిందని, ఆ సమయంలో వివేకానందరెడ్డి నో మోర్ అని చెప్పగానే తాము షాక్ గురయ్యామని, వెంటనే బయటకు వచ్చేశామని తమ మధ్య దానిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

తాను చెప్పిన వివరాలు రికార్డు చేసుకుంటానని సిబిఐ అధికారి కోరారని, సెక్షన్ 160 స్టేట్‌మెంట్‌కు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువ ఉండదని, దాని మీద వారు ఏమైనా రాసుకునే అవకాశం ఉంటుందనే అలా చేస్తారన్నారు. తాను దర్యాప్తు అధికారికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చానని, ఆ రోజు వివేకా మరణంపై తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని అజేయ కల్లం చెప్పారు. సిబిఐ ఎస్పీతో భేటీని నిరాకరించే అవకాశం ఉన్నా దర్యాప్తుకు సహకరించడానికి ఆయనతో భేటీ అయినట్లు చెప్పారు.

సిబిఐ ఎందుకు ఖండించడం లేదు…

పత్రికల్లో వస్తున్న అపోహలు కలిగించే అసత్య కథనాలను సిబిఐ ఖండించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సిబిఐను ఉదహరిస్తూ వార్తలు ప్రచురిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని అజేయ కల్లాం ప్రశ్నించారు. సిబిఐ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వారికి ఉందన్నారు.

వైసీపీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాలేజీలో తన గురువు అని, కాలేజీలో తనకు పాఠాలు చెప్పారని, మ్యానిఫెస్టో తయారు చేయడానికి సాయం చేయాలని కోరితే ఆ సమావేశానికి వెళ్లానని అజేయ కల్లం చెప్పారు. ఆ సమయంలో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఆయన ఉన్నారని, ఆయన కోరితేనే తాను సమావేశానికి వెళ్లానని చెప్పారు.

సమావేశం జరిగే సమయంలో ఎవరైనా బయటకు వెళితే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందని అజేయ కల్లం ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని నమోదు చేసుకుని గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదన్నారు.

విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు సేకరించే వివరాలను కోర్టుకు సమర్పించే వరకు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, కోర్టుకు కూడా ఇవ్వని వివరాలను బయటకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలపై సిబిఐ సమాధానం చెప్పాలన్నారు. సిబిఐ ఎస్పీ తమ ఇంటికి వచ్చి, కాసేపు మాట్లాడారని, తన నుంచి లిఖిత పూర్వకంగా ఎలాంటి వివరాలు సేకరించలేదని, తాను స్వచ్ఛందంగానే ఆయనతో మాట్లాడానని చెప్పారు.

వివేకా చనిపోయిన రోజు యాధృచ్చికంగా తాము అక్కడ ఉన్నామని, ఆ రోజు జరిగిన ఘటనకు తమ సమావేశానికి సంబంధం ఏమిటని, సమావేశం జరిగిన తర్వాత ప్రతి నిమిషం , ఏ నిమిషం ఏమి జరిగిందో తమకు ఎలా గుర్తుంటుందని, దానిని భూతద్దంలో చూపించి, మొదటి పేజీలో ఫోటోలు వేసి కథనాలు ప్రచురించడాన్ని తప్పు పట్టారు.

పత్రికల్లో వస్తున్న కథనాలకు సిబిఐ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, దర్యాప్తు ముగిసే వరకు ఈ తరహా కథనాలు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం సిబిఐ మీద ఉందన్నారు. తాను చెప్పని వివరాలను కూడా అసత్యాలతో కూడిన కథనాల్లో ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

IPL_Entry_Point