Agency Tribes Protest: వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చడంపై ఏజెన్సీలో బంద్-agency bandh over assembly resolution to include boya and valmiki castes in sts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Agency Bandh Over Assembly Resolution To Include Boya And Valmiki Castes In Sts

Agency Tribes Protest: వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చడంపై ఏజెన్సీలో బంద్

HT Telugu Desk HT Telugu
Mar 31, 2023 09:57 AM IST

Agency Tribes Protest: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ కులాల జాబితాలోకి వాల్మీకి, బోయ, బెంతు ఒరియా కులాలను చేర్చాలనే రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై ఏజెన్సీ ప్రాంతంలో బంద్ పాటిస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు.

అల్లూరి జిల్లాలో ఆందోళన నిర్వహిస్తున్న గిరిజన సంఘాలు
అల్లూరి జిల్లాలో ఆందోళన నిర్వహిస్తున్న గిరిజన సంఘాలు

Agency Tribes Protest: గిరిజన రిజర్వేషన్ జాబితాలోకి బోయ, వాల్మీకి, బెంతు ఒరియా కులాలను చేర్చాలనే ఏపీ ప్రభుత్వ తీర్మానంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ జరుగుతోంది. పోలవరం ముంపు మండలాలతో పాటు విశాఖ ఏజెన్సీలో సంపూర్ణంగా బంద్ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

బోయ వాల్మీకి లను ఎస్‌టి జాబితాలో చేర్చాలని సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ... రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది.

బోయ, వాల్మీకి, బెంతుఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ మన్యం బంద్‌ను విజయవంతం చేయడానికి ఉదయం నుంచి గిరిజనులు రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సత్యపాల్‌, శ్యామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ కమిటీలతో పాటు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ రిపోర్టులను బహిర్గతం చేయాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీలు చేపట్టిన బంద్‌లో భాగంగా ... మన్యంలో సిపిఎం ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. చింతపల్లిలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి బంద్‌ కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు వద్ద మన్యం బంద్‌ సంపూర్ణంగా జరుగుతోంది. అరకు ప్రాంతం నుంచి పర్యాటకులను ముందే పంపేశారు. డుంబ్రిగుడ మండల కేంద్రంలోను బంద్‌ కొనసాగుతోంది. రంపచోడవరంలోనూ బంద్‌ కొనసాగుతోంది. చింతలవీధి పంచాయతీ పరిధిలో ఉబ్బాడిపుట్టు గ్రామంలో, లమ్మసింగిలో బంద్‌ కొనసాగిస్తున్నారు.

మార్చి 13న బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ నివేదికలో మొదటి భాగాన్ని ముఖ్యమంత్రికి రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం అందచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా వాల్మీకి, బోయ, బెంతు ఒరియా కులాలను గిరిజనుల్లో చేరుస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇది గిరిజనుల ఆగ్రహానికి కారణమైంది.

వైసీపీ ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల బంద్‌కు పిలుపునిచ్చారు. గిరిజన సంఘం, ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చిన శుక్రవారం నాటి బంద్‌కు వర్తక సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ శాసన సభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా చేపట్టనున్న ఆందోళనకు మద్దతుగా సంఘాల నాయకుల అభ్యర్థన మేరకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వర్తకులు సాయంత్రం ఆరు గంటల వరకు దుకాణాలు తెరవరాదని నిర్ణయించారు. రాష్ట్ర బంద్‌ను గిరిజన ఉద్యోగులు విజయవంతం చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు బౌడు గంగరాజు పిలుపునిచ్చారు.

 

IPL_Entry_Point