Annavaram Tourism : రత్నగిరి టు సత్యగిరి.. త్వరలో అన్నవరంలో ఏరియల్ కేబుల్ కార్ సేవలు
Annavaram Tourism : అన్నవరం.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది పంపా నది తీరం. పచ్చని పొలాలు, ప్రకృతి సోయగాలు. అలాంటి చోటును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. త్వరలోనే అన్నవరంలో ఏరియల్ కేబుల్ కార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఏటా లక్షల మంది భక్తులు సందర్శించే అన్నవరం పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక- పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అవి కార్యరూపం దాల్చేదిశగా చర్యలు ప్రారంభం అయ్యాయి. అన్నవరం దేవాలయాన్ని రూ.25.92 కోట్ల ప్రసాద్ నిధులతో అభివృద్ధికి రంగం సిద్ధం అయ్యింది. ఇక్కడికి వచ్చే భక్తులకు పర్యాటక అభివృద్ధితో మరింత ఆహ్లాదం పంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అన్నవరం పుణ్యక్షేత్రంలో పక్కపక్కనే ఉన్న రత్నగిరి-సత్యగిరి కొండలకు ఓ ప్రత్యేకత ఉంది. శంఖవరం మండలం అన్నవరంలోని రత్నగిరిపై హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపుడిగా అనంతలక్ష్మీ సమేతుడైన సత్యదేవుడు కొలువై ఉన్నాడు. తొండంగి మండలం బెండపూడి పరిధిలో ఉన్న 300 ఎకరాల విస్తీర్ణంలోని సత్యగిరి కొండపై దేవస్థానానికి వచ్చే భక్తుల వసతి, కల్యాణ మండపాలు, ఇతరత్రా ఉంటాయి.
అయితే.. రత్నగిరి-సత్యగిరి కొండల మధ్య పీపీపీ విధానంలో రోప్ వే ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టికెట్ కౌంటర్, కియోస్క్, ఎంట్రన్స్ ఆర్చి, మరుగుదొడ్లు ఇతర వసతులు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రాబోయే అయిదేళ్లలో రూ.11 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుతో స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ రోప్‌వే తరహాలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేబుల్ కార్ ప్రాజెక్టు ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టు వివరాలు..
రత్నగిరి నుంచి సత్యగిరి వరకు ఏరియల్ కేబుల్ కార్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 800 మీటర్ల పొడవైన రోప్ వే ను ఏర్పాటు చేస్తారు. దీని అంచనా వ్యయం రూ.6 కోట్లు అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భక్తుల తాకిడి ఏటా 2.50 లక్షలు ఉందని.. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.