Telugu News  /  Andhra Pradesh  /  Admissions In Five New Medical Colleges From Next Year In Andhra Pradesh
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

AP New Medical Colleges : ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్స్

05 February 2023, 14:55 ISTHT Telugu Desk
05 February 2023, 14:55 IST

Medical Colleges Admissions : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు కళాశాలలకు అనుమతులు వచ్చాయి. మరికొన్నింటికి అనుమతులు రావాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వం(AP Govt) 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కళాశాలల నిర్మాణం మెుదలైంది. కొన్ని కళాశాలలకు అనుమతులు మంజూరు అయ్యాయి. మరికొన్ని వైద్య కళాశాలలకు అనుమతులు రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం నుంచి కొత్తగా ఐదు వైద్య కళాశాలలు(Five Medical Colleges) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

2023-2024 విద్యా సంవత్సరం నుంచి 5 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు మొదలు అవుతాయి. 2024-2025 నుంచి మరో 5 కళాశాలల్లో అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు(Eluru), రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆయా జిల్లాల్లోని జిల్లా బోధనాసుపత్రులుగా తీర్చిదిద్దుతారు. మచిలీపట్నం మినహా మిగిలిన నాలుగు ప్రాంతాల్లో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు(MBBS Seats) అందుబాటులోకి వస్తాయి.

మరోవైపు 2024-2025కు సంబంధించి ఐదు మెడికల్ కాలేజీలు సైతం ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. పాడేరు(Paderu), మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో మెుదలవుతాయి. పాడేరులో ఇప్పటికే ఉన్న 150 పడకల ఆసుపత్రికి అదనంగా 330 పడకలు ఏర్పాటు చేస్తారు. మిగిలిన మరో 7 వైద్య కళాశాలలను 2025-2026లోగా తీసుకువచ్చే అవకాశం ఉంది.

కొత్త వైద్య కళాశాల్లో అకడమిక్ కార్యకలాపాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో ఈ ఐదు వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు(Admissions) ప్రారంభం అవుతాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో మరో మూడు సంవత్సరాల్లో 750, 750 , 1050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం రూ.8,480 కోట్లు వ్యయం చేస్తోంది ప్రభుత్వం.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు రాజమండ్రిలో నూతన వైద్య కళాశాలలు అకడమిక్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు యుద్ధప్రాదిపదికన ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆసుపత్రులు బోధన ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రానున్నాయి.