Tirumala : ఈనెల 30 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు - 25 రోజుల పాటు నిర్వహణ-adhyayanotsavams are scheduled in tirumala from december 30 in 2024 to january 23 in 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఈనెల 30 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు - 25 రోజుల పాటు నిర్వహణ

Tirumala : ఈనెల 30 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు - 25 రోజుల పాటు నిర్వహణ

TTD Adhyayanotsavams 2024 : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారికి నిర్వహించే అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు డిసెంబరు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపనున్నట్లు టీటీడీ పేర్కొంది.

తిరుమల ఆలయం (image source twitter)

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో అప్డేట్ ఇచ్చింది. శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల పాటు నిర్వహించే అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలపై ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి తిరుమలలో ఘనంగా జరపనున్నట్లు తెలిపింది.

2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.

  • ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
  • ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
  • తొలి 11 రోజులను పగల్‌పత్తు అని పిలుస్తారు. మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు.
  • అధ్యయనోత్సవాల్లో 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది ఉంటుంది.
  • 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర ఉండగా… 25వ రోజుతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం:

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 19వ తేదీ వరకు ఈ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభం సందర్భంగా… జనవరి 7వతేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

బ్రేక్ దర్శనాలు రద్దు :

  • జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
  • ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.
  • ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు.
  • శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.
  • అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
  • జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు.
  • జనవరి 6వ తేది ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.

సంబంధిత కథనం