Anantapur : ఇండస్ట్రీ జోలికి రావొద్దు.. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు!-actress madhavi latha filed complaint against tdp leader jc prabhakar reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur : ఇండస్ట్రీ జోలికి రావొద్దు.. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు!

Anantapur : ఇండస్ట్రీ జోలికి రావొద్దు.. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు!

Basani Shiva Kumar HT Telugu
Jan 18, 2025 02:47 PM IST

Anantapur : జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ నటి మాధవీలత ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఆయనపై ఫిర్యాదు చేయగా.. 'మా' ట్రెజరర్ శివబాలాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీపై పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ చేయడం తగదన్నారు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన నటి మాధవీలత.. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హెచ్‌ఆర్సీ, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని మాధవీలత వెల్లడించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని వాపోయారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదన్నారు. అందుకే మూవీఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు.

శివబాలాజీకి కాల్ చేస్తే..

'మా' ట్రెజరర్ శివబాలాజీకి కాల్‌ చేస్తే స్పందించారని మాధవీలత వివరించారు. తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిత్వ హననడం చేయడం దారుణమని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఇండస్ట్రీ జోలికి రావొద్దు..

ఈ ఇష్యూపై శివబాలాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దని స్పష్టం చేశారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని 'మా' ట్రెజరర్ శివబాలాజీ స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని మాధవీలత పట్టుబట్టినట్టు తెలుస్తోంది.

జేసీ క్షమాపణలు..

గతేడాది డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్కులో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సమయంలో.. మాధవీలతతోపాటు, బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణ కోరుతున్నట్టు జేసీ ఇటీవల స్పష్టం చేశారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశానన్నారు.

కొండా సురేఖ కూడా..

ఇటీవల సినిమా ఇండస్ట్రీపై పొలిటికల్ లీడర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ భగ్గుమంది. దీంతో కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అయినా ఆ వివాదం ఆగలేదు. కోర్టు వరకు వెళ్లింది. కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేశారు.

Whats_app_banner