Budameru Works: కేంద్రం సాయంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణ, విజయవాడ వైపు ఆక్రమణల తొలగింపు ప్రతిపాదనలు
Budameru Works: విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు నుంచి శాశ్వత నివారణ కోసం కార్యాచరణను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం పెంపుతో పాటు విజయవాడ వైపు బుడమేరు ప్రవాహ మార్గంలో ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు.
Budameru Works: విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్న బుడమేరు ముంపు నుంచి నగరాన్ని రక్షించడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా కార్యాచరణను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కృష్ణా నదితో పాటు బుడమేరుకు ఒకేసారి వరద వస్తే ప్రవాహాన్ని మళ్లించేందుకు వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్ద్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.
బుడమేరు వరద నియంత్రణ పై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ, లు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమగ్ర నివేదిక అందించేందుకు ఆయా శాఖల అధికారులతో బుడమేరుపై సమగ్ర సమీక్ష చేశారు.
బుడమేరు విషయంలో జరుగుతున్న తప్పులు పునరావృత్తం కాకుండా, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు ఇప్పటికే నాలుగుసార్లు బుడమేరు వరదలపై ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా సమీక్షలు చేశాయి. వరదల సమయంలో బుడమేరు నుంచి వెళ్లే ప్రవాహ వేగాన్ని పెంచడంతో పాటు 40,000 క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునే విధంగా భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
ఒక్కరోజే 50,000 క్యూసెక్కుల వరద నీరు రావడం, మూడు చోట్ల గండ్లు పడటం వల్ల విజయవాడను వరద ముంచెత్తిందని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. భవిష్యత్ లో బుడమేరు వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు బుడమేరు డైవర్షన్ కెనాల్ కెపాసిటీ ప్రస్తుతం 17,500 క్యూసెక్కుల నుంచి 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేస్తున్నట్టు చెప్పారు.
వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్ద్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచనలు చేశామన్నారు. 2014-19 కాలంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేలా రూ. 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు కూడా పూర్తి చేశామన్నారు. అయితే గత ప్రభుత్వం బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20 శాతం పనులకు సంబంధించి మట్టి, బస్తా సిమెంట్ పని గాని వేయలేదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాపం ఫలితమే బుడమేరు ముంపుకు కారణమన్నారు. దానికి విజయవాడ నగర ప్రజలు మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు.
2014-19 కాలంలోనే ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బుడమేరు ఛానెల్ కు సమాంతరంగా ఓల్డ్ ఛానెల్ ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. కొల్లేరు నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సముద్రానికి వెళ్లేలా ఉప్పుటేరు ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇదే అంశం మీద ఈ నెల 18న మరోసారి సమీక్ష చేస్తామన్నారు. బుడమేరు వరద నియంత్రణ కు సంబంధించి కేంద్రానికి నివేదించి ముంపు నివారణలో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరతామని మంత్రి నారాయణ చెప్పారు.