Vizianagaram : ఆరు నెలల పసిపాపపై అత్యాచారం.. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
Vizianagaram : విజయనగరం జిల్లాలో ఆరు నెలల పసిపాపపై అత్యాచారం జరిగింది. ఈ ఘోరమైన ఘటనలో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకుండా పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి జరిమానా కూడా విధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జన్నివలస పంచాయతీ నేరెళ్ల వలస గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బోయిన ఎరుకన్నదొర (40) 2024 జులై 13న ఆరునెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడు ఈ ఘటన సంచలనం అయింది. జులై 13న వరసకు కుమార్తె అయిన మహిళ ఇంటికి వెళ్లి.. ఎరుకన్న దొర ఉయ్యాలలో ఉన్న ఆరు నెలల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడ నుంచి పరారయ్యాడు.
తల్లి ఫిర్యాదుతో..
దీంతో పసిపాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామభద్రపురం పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, బొబ్బిలి రూరల్ సీఐ ఎస్. తిరుమలరావు, రామభద్రపురం ఎస్ఐ జ్ఞానప్రసాద్ దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
న్యాయమూర్తి తీర్పు..
ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి శుక్రవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేయడంలోనూ, సాక్షులను ప్రవేశపెట్టడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
సత్యసాయి జిల్లాలో..
సత్యసాయి జిల్లాలో పోక్సో కేసు నిందితుడు అరెస్టు అయ్యాడు. సత్యసాయి జిల్లా వజ్రకరూరు మండలంలోని ఒక గ్రామంలో మూడు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ నాయక్ అనే వ్యక్తి తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు.
నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మండలంలోని పీసీ ప్యాపిలి బస్ స్టేషన్ వద్ద.. బస్సు కోసం వేచి ఉన్న ఆదినారాయణ నాయక్‌ను గుర్తించి, అరెస్టు చేశారు. విచారణ అనంతరం ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసును పోక్సో ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతుంది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)