Dental Student Murder: డెంటల్ స్టూడెంట్ హత్య కేసు నిందితుడికి యావజ్జీవ శిక్ష-accused of murdering dental student gets life imprisonment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Accused Of Murdering Dental Student Gets Life Imprisonment

Dental Student Murder: డెంటల్ స్టూడెంట్ హత్య కేసు నిందితుడికి యావజ్జీవ శిక్ష

Sarath chandra.B HT Telugu
Dec 05, 2023 07:28 AM IST

Dental Student Murder: ఇన్‌స్టగ్రామ్‌‌లో పరిచయమైన డెంటల్‌ స్టూడెంట్‌ను హత్య చేసిన నిందితుడికి గుంటూరు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. హత్య జరిగిన ఏడాదిలోపే శిక్ష ఖరారు చేసింది.

డెంటల్ స్టూడెంట్‌ను హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ శిక్ష
డెంటల్ స్టూడెంట్‌ను హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ శిక్ష (Pixabay )

Dental Student Murder: ఇన్‌స్టా‌గ్రామ్‌లో పరిచయం అయిన యువతి వివాహానికి నిరాకరించడంతో హత్యకు పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 2020 నవంబర్‌‌లో సోషల్‌ మీడియాలో చిన అవుటపల్లి సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో బీడీఎస్‌ చదువుతూ హాస్టల్లో ఉంటున్న తపస్వి పరిచయం అయ్యింది. తల్లిదండ్రులు ముంబయిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉండేవారు.

సమీప బంధువులు ఉంగటూరులో ఉన్నా విద్యార్ధిని హాస్టల్లో ఉంటూ చదువుకునేది. మన్నే జ్ఞానేశ్వర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో, 2021 మార్చిలో జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చి విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

తరువాత ఇద్దరూ గన్నవరంలో ఓ గది అద్దెకు తీసుకొని కొంతకాలం ఉన్నారు. కొన్నాళ్లకు జ్ఞానేశ్వర్ అబద్దాలు చెప్పినట్టు తపస్విని గుర్తించడంతో అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది. ఉంటున్న గది ఖాళీ చేసి తక్కెళ్లపాడులో నివాసం ఉంటున్న డెంటల్ స్టూడెంట్‌ వద్ద ఉంటోంది. రోజూ తక్కెళ్లపాడు నుంచి కాలేజీకి వెళ్లి వస్తుండేది.

2022 నవంబరులో తపస్వి వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనపై నూజివీడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని మందలించి ఆమె దగ్గర తీసుకుని తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు యువతికి ఇప్పించారు. గత ఏడాది డిసెంబర్‌ 5న కత్తి, సర్జికల్‌ బ్లేడులు కొని తన ద్విచక్ర వాహనంపై తపస్వి నివాసం ఉంటున్న తక్కెళ్లపాడులోని ఇంటి వద్దకు వెళ్లాడు.

పెళ్లి చేసుకోవాలని కోరడంతో అందుకు నిరాకరించింది. దీంతో కత్తి, సర్జికల్‌ బ్లేడులతో ఆమె శరీరంపై ఇష్టానుసారం పొడిచాడు. అనంతరం తనను తానూ కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పక్క గదిలో ఉన్న స్నేహితురాలు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

WhatsApp channel