వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న అభియోగాలతో ఆమెపై చర్యలకు దిగింది. తాజాగా ఆమెపై కేసు నమోదు చేసిన ఏసీబీ… ఏ1గా చేర్చింది. దీంతో ఆమెకు నోటీసులు జారీ చేయటంతో పాటు విచారణకు పిలిచే అవకాశం ఉంది.
విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో((రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి)గా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ… ఇటీవలనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకుంది. విడదల రజినిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు కూడా లేఖ రాసింది. అయితే ఈ లేఖకు రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో… ఆమెపై తాజాగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది..!
బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ జరిపించారు. ఇందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందగా… ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో ఈ కేసులోని ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో విచారించే పనిలో ఏసీబీ పడింది. ఎఫ్ఐఆర్ లో ఉన్న వారికి నోటీసులిచ్చి… విచారించే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనేది వీరిపై ప్రధాన అభియోగం. రూ.5 కోట్లు డిమాండ్ చేశారని… రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రజినీ పీఏతో పాటు మరికొంత మంది పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఈ కోణంలోనే… పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో రజనిని ఏ1గా చేర్చగా… జాషువాను ఏ2గా, ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ పేర్లను పేర్కొంది.