Two Children Rule: స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు.. ఎన్నికల్లో పోటీకి తొలగిన అడ్డంకి
Two Children Rule: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డంకిగా మారిన ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదం తెలిపింది.ఈ మేరకు మునిసిపల్, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది.ఇకపై స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరుపిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఉండదు.
Two Children Rule: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అడ్డంకిగా మారిన నిబంధనపై ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇకపై అనర్హులుగా ప్రకటించే నిబంధనను ఆంధ్రప్రదేశ్ శాసన సభ రద్దు చేసింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువమంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా నిర్ణయిస్తూ చట్టం చేశారు. దీనిపై గత 30ఏళ్లుగా ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారనే కారణంగా మహిళలపై వివక్ష చూపడమేనని విమర్శలు కూడా వచ్చాయి.
30ఏళ్ల తర్వాత ఈ నిబంధన తొలగించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరగడం, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వంటి అంశాలు వెలుగు చూశారు. ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6శాతం ఉంటే 2024నాటికి అది 1.5శాతం మాత్రమే ఉంది.
రాష్ట్రంలో జనాభా రేటు తగ్గిపోవడంలో కేంద్రం నుంచి వచ్చే పన్ను ఆదాయంలో కోతలు మొదలుకుని అనేక రకాల నష్టాలు ఉన్నాయని ఆలస్యంగా గుర్తించారు. ఇద్దరి కంటే పిల్లలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీకి అనుమతించక పోవడం వివక్ష అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీనిపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిని అనర్హులుగా పరిగణించే నిబంధన రద్దు చేయాలనే డిమాండ్ నేపథ్యంలో చట్ట సవరణకు శాసనసభ అమోదం తెలిపింది. మునిసిపల్, పంచాయితీరాజ్ చట్ట సవరణలకు సభ అమోదముద్ర వేసింది. మండలిలో అమోదం తర్వాత భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి.