ప్రత్యేక ఆధార్ క్యాంపులపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ రెండో వారం, నాలుగో వారంలో స్కూల్స్, కాలేజీలు, సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ,వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 5-15 ఏళ్ల వయసు గల 56,21,743 మందికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి చేశారు. దీంతో వీరంతా కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. జూన్ 10-13వ తేదీ వరకు, జూన్ 24-27వ తేదీ వరకు ఈ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పౌరులకు సూచించింది.
చిన్నారులకు ఆధార్ నమోదుకు క్యూర్ కోడ్ ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి. పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి. చిన్నారులను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఇక ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, ఉచితంగా ఆ మార్పులు చేసుకునే గడువు 2025 జూన్ 14 తో ముగుస్తుంది. ఆ తరువాత ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి… మీఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం