Bapatla district : ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి, రైళ్లలో దొంగతనాలు - ఎట్టకేలకు ఇలా దొరికిపోయాడు...!
Bapatla district Crime News : ఇంటర్నెట్‌లో సినిమాలు చూసి రైళ్లలో ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడ్డాడు. బాపట్లకు చెందిన సదరు యువకుడు ఎట్టకేలకు రైల్వే పోలీసులకు చిక్కాడు.
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, వెంకటేష్ విలాసవంతమైన జీవనానికి, వ్యవసనాలకు బానిస అయ్యాడు. కూలీ చేసుకోవడంతో సంపాదించిన డబ్బులు తన అవసరాలకు సరిపోవటం లేదని భావించి… సులువుగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు.
దీంతో ఎలా సులువుగా డబ్బులు సంపాదించాలి అని ఆలోచన చేశాడు. దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనంతోనే డబ్బులు సులువుగా సంపాదించొచ్చని భావించాడు. రైళ్లలలో దొంగతనాలు చేయాలని అనుకున్నాడు. అయితే ఎలా చేయాలనే దానిపై ఓ అంచనా రావటం కోసం… తన సెల్‌ఫోన్‌లో దొంగతనాలకు సంబంధించిన పలు వీడియోలు చూశాడు.
బయట దొంగతనాలు అయితే ఈజీగా దొరికిపోతామని భావించి, రైళ్లలో అయితే దొరకడం కష్టం అవుతుందని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే రైళ్లలో ప్రయాణికులు హడావుడితో ఉంటారు. అందువల్ల దొంగతనం చేసి తప్పించుకోవడం సులువుగా ఉంటుందని భావించాడు. అందుకే రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లను చేసి ప్రేరణ పొంది రైలు దొంగగా అవతారమెత్తాడు.
రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారం, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు దొంగతనం చేసేవాడు. ఇటీవలే చీరాలలో రైలు దొంగతనాలు ఎక్కువ కావడంతో రైల్వే అధికారులు గస్తీ పెంచారు. రైళ్లలో దొంగతనాలపై ఒక కన్ను వేశారు. దొంగతనాలపై దర్యాప్తనకు గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్ కొండయ్య తన సిబ్బందితో విచారణ చేశారు.
టెక్నాలజీ సహాయంతో నిందితుడు వెంకటేశ్వర్లు అని గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వే స్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాంపై నిందితుడు వెంకటేశ్వర్లును రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువ చేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్‌ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఒక ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కటకటాల్లోకి పంపారు.
శుక్రవారం నెల్లూరు జిల్లాలో రైల్వే డీఎస్పీ సీ.విజయభాస్కర్‌రావు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.