Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరం.. ఫోన్ చాటింగ్‌లో పరిచయం.. బాలికను నమ్మించి అత్యాచారం
Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుంది. ఫోన్ చాటింగ్‌లో పరిచయం అయిన యువకుడు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను నమ్మించి రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లాలోని కంకిపాడులో దారుణం చోటు చేసుకుంది. పెనమలూరు మండలంలో కానూరు సనత్‌నగర్ రామాలయం వద్ద బాలిక (16) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆ బాలిక స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో బాలికతో కంకిపాడుకు చెందిన విజయ్‌బాబు అనే యువకుడు ఫోన్ చాటింగ్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 2న వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్న బాలికకు విజయ్‌బాబు ఫోన్ చేశాడు. తాను ఆటోనగర్ టెర్మినల్ వద్ద ఉన్నానని, అక్కడకు రమ్మని చెప్పాడు.
నమ్మిన బాలిక..
బాలిక పని ముగించుకుని ఆటోనగర్ టెర్మినల్ వద్దకు వెళ్లింది. విజయ్ బాబు అప్పకటికే అక్కడ ద్విచక్ర వాహనంతో ఉన్నాడు. బైక్‌పై సరదాగా విజయవాడలో తిరిగి వద్దామని నమ్మబలికాడు. విజయ్‌బాబు మాటలను నమ్మిన బాలిక అందుకు అంగీకారం తెలిపింది. బాలికను కంకిపాడు తీసుకుకెళ్లాడు. అక్కడ రూమ్‌లో బంధించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను ఈనెల 3న కంకిపాడులో బస్సు ఎక్కించి పంపేశాడు. బాలిక ఇంటికి చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది.
గోప్యత ఎందుకు..
తల్లిదండ్రులు పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు విజయ్‌బాబుపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ ఘటనను పోలీసులు మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. శనివారం ఘటన బయటకు పొక్కింది. పోలీసుల గోప్యతపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఈ కేసు పట్ల ఎందుకు గోప్యత పాటించారనే అనుమానంతో స్థానికంగా చర్చ జరగుతోంది.
ప్రేమ పేరుతో వేధింపులు..
కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనిగండ్లపాడు గ్రామానికి చెందిన మైనర్ బాలిక (14) శనగపాడులోని తాత, నాన్నమ్మ వద్ద ఉంటుంది. నందిగామ దగ్గరలోని పల్లగిరి సమీపంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెను గత కొంతకాలంగా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఈమన గోపి అనే యువకుడు ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.
వేధింపులు తాళలేక..
వేధింపులు తాళలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనతో శనగపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎంఎస్‌కె అర్జున్ తెలిపారు. నిందితుడు గోపిని అరెస్టు చేశామని, ఆయనను కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ అర్జున్ వెల్లడించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)