Prakasam District : ఇంత ఘోరమా.. స‌హ‌జీవ‌నం చేయ‌టం లేద‌ని మ‌హిళ‌ను హ‌త్య చేసిన యువ‌కుడు-a young man murdered a woman in prakasam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam District : ఇంత ఘోరమా.. స‌హ‌జీవ‌నం చేయ‌టం లేద‌ని మ‌హిళ‌ను హ‌త్య చేసిన యువ‌కుడు

Prakasam District : ఇంత ఘోరమా.. స‌హ‌జీవ‌నం చేయ‌టం లేద‌ని మ‌హిళ‌ను హ‌త్య చేసిన యువ‌కుడు

HT Telugu Desk HT Telugu
Dec 07, 2024 10:07 AM IST

Prakasam District : ప్ర‌కాశం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న జరిగింది. స‌హ‌జీవ‌నం చేయ‌టం లేద‌ని ఓ యువకుడు మహిళను హత్య చేశాడు. అనంత‌రం నిందితుడు ప‌రార‌య్యాడు. క‌త్తి పోట్ల‌కు గురైన మ‌హిళ మృతి చెంద‌డంతో ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు అనాథల‌య్యారు. మ‌హిళ త‌ల్లిదండ్రులు ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మ‌హిళ‌ను హ‌త్య చేసిన యువ‌కుడు
మ‌హిళ‌ను హ‌త్య చేసిన యువ‌కుడు (istockphoto)

ప్ర‌కాశం జిల్లాలోని గిద్ద‌లూరు ప‌ట్ట‌ణం ర‌జ‌కవీధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు మహిళను హత్య చేశాడు. ఈ ఘటన గురించి బాధిత మ‌హిళ కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాచ‌ర్ల మండ‌లానికి చెందిన పేకినేని సుహాసిని (28), కృష్ణ భార్య భ‌ర్త‌లు. వీరికి ఇద్ద‌రు సంతానం. కుమారుడు, కుమార్తె ఉన్నారు. భ‌ర్త కృష్ణ రెండేళ్ల కిందటే మృతి చెందాడు. భ‌ర్త ద‌హ‌న సంస్కారాలు పూర్తయిన త‌రువాత సుహాసిని రాచ‌ర్ల‌లోని ఎస్‌సీ కాల‌నీకి చెందిన నాని అనే యువ‌కుడితో క‌లిసి హైద‌రాబాద్ వెళ్లిపోయింది.

yearly horoscope entry point

నానితో కొన్ని నెల‌ల పాటు స‌హ‌జీవ‌నం చేసింది. ఆ త‌రువాత వారిద్దరికి గొడ‌వులు వచ్చాయి. దీంతో సుహాసిని ఐదు నెల‌ల కిందట మ‌ళ్లీ త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వ‌చ్చేసింది. అప్పుడు నాని కూడా గిద్ద‌లూరికి వ‌చ్చేశాడు. సుహాసిని వ‌ద్ద‌కు వెళ్లి క‌లిసి ఉందామ‌ని వేధిస్తున్నాడు. నాని వేధింపులు భ‌రించ‌లేక సుహాసిని రాచ‌ర్ల పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాచ‌ర్ల పోలీసులు నానిని స్టేష‌న్‌కు పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. సుహాసిని వేధించ‌డం మానుకోవాల‌ని హెచ్చ‌రించారు.

గిద్ద‌లూరు ప‌ట్ట‌ణంలోని ర‌జ‌క‌వీధిలో సుహాసిని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుంది. బ‌తుకు దెరువు కోసం స్థానికంగా ఉన్న బ‌ట్ట‌ల షాప్‌లో పని చేసుకుంటూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే.. త‌నతో స‌హజీవ‌నానికి ఒప్పుకోక‌పోవ‌డం, త‌న‌పైనే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సుహాసినిపైన నాని క‌క్ష‌పెట్టుకున్నాడు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సుహాసిని ఒక్క‌తే ఇంట్లో ఉన్న స‌మ‌యంలో.. ఆమె ఇంట్లోకి చొర‌బ‌డి క‌త్తితో విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశాడు. గొంతు, పొట్ట‌, గుండెల‌పై దాడి చేసి ప‌రార‌య్యాడు.

సుహాసిని కేక‌లు విని స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. తీవ్ర గాయాల‌తో ఉన్న ఆమెను గిద్ద‌లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రథ‌మ చికిత్స చేశారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్ర‌భుత్వ ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. కొద్దిసేప‌టికే సుహాసిని మృతి చెందింది. పోస్టుమార్టం అనంత‌రం ఆమె మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

త‌ల్లి మృతి చెంద‌డంతో ఇద్ద‌రు పిల్ల‌లూ అనాథల‌య్యారు. గిద్ద‌లూరు సీఐ సురేష్ ఆసుప‌త్రికి చేరుకుని కుటుంబ సభ్యుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు చేరుకుని ఆధారాల‌ను సేక‌రించారు. నిందితుడిపై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్య‌లు చేప‌డుతున్న‌ట్లు చెప్పారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner