NRI Death: అమెరికాలో నీట మునిగి ప్రకాశం జిల్లా యువకుడి మృతి, కాలిఫోర్నియా బీచ్‌లో ఘటన
NRI Death: అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియా బీచ్‌లో విహార యాత్ర కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెల్లిన యువకుడు సముద్రపు అలల్లో మునిగిపోయాడు. ఈ ఘటనతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.
NRI Death: విహార యాత్ర విషాదాన్ని నింపింది. అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌కు వెళ్లిన యువకుడు సముద్రపు అలల్లో కొట్టుకుపోయాడు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల కుమారుడు బుచ్చిబాబు(40) ఎంసీఏ చదువుకున్నారు. రెండేల్ల క్రితం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే బుచ్చిబాబుకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నారు. వీసా లభించడంతో ఆర్నెల్ల క్రితం భార్యతో పాటు ఐదేళ్ల కుమారుడు నిఖిల్ అద్వైత్‌ను కూడా అమెరికాకు వెళ్లారు. ముగ్గురూ కలిసి శనివారం కాలిఫోర్నియా బీచ్‌కి విహారం కోసం వెళ్లారు. సముద్రంలో ముగ్గురు కలిసి స్నానం చేశారు. బీచ్‌లో సెల్ఫీలు దిగారు.
ఆ తర్వాత ముగ్గురూ ఒడ్డుకు వచ్చిన తర్వాత బుచ్చిబాబు మళ్లీ ఒంటరిగా సముద్రపు నీటిలో దిగాడు. ఈ క్రమంలో అలలు వేగంగా రావడంతో ఉక్కిరిబిక్కిరై కొట్టుకుపోయాడు. కళ్లెదుటే భర్త నీటిలో కొట్టుకుపోవడంతో భార్య అక్కడున్న వారిని సాయం కోరినా అప్పటికే ఆలస్యమైపోయింది.
ముండ్లమూరులో ఉంటున్న బుచ్చిబాబు తల్లిదండ్రులకు ఆదివారం మరణ వార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు బుచ్చిబాబు తండ్రి కోటేశ్వరరావును ఫోన్‌లో పరామర్శించారు. మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు కేంద్ర మంత్రుల ద్వారా మృతదేహాన్ని త్వరితగతిని ముండ్లమూరుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని స్థానిక టీడీపీ నాయకులు పరామర్శిస్తున్నారు.