Acid Attack: అన్నమయ్య జిల్లాలో ఘోరం, యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోసిన యువకుడు…
Acid Attack: మదనపల్లె అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి ఏప్రిల్ 29న వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో యువకుడు దాడి చేసి ఆమెపై యాసిడ్ పోసినట్టు గుర్తించారు.

Acid Attack: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన జరిగింది. వివాహం నిశ్చయమైన యువతిపై కత్తితో దాడి చేసి ఆమె ముఖంపై యాసిడ్ పోసిన ఘటన వెలుగు చూసింది.
గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్ గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల పరిధిలోని పేరం పల్లె గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న సదరు యువతికి తల్లిద్రండులు పెళ్లి నిశ్చయం చేశారు.
యువతికి పెళ్లి నిశ్చయించిన విషయం తెలిసిన గణేష్ యువతిపై కోపం పెంచుకున్నాడు. యువతి ఒంటిరిగా వెళ్తుండటం గమనించి ఆమెపై దాడి చేశాడు. కత్తితో పొడిచి ఆపై ముఖంపై యాసిడ్ పోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు. చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పీలేరులో యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ తో మంత్రి లోకేష్ ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేశారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న మంత్రి మండుపల్లి రాంప్రసాద్ తో మాట్లాడిన లోకేష్... గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.