Nellore Crime : సినీ హీరోనంటూ పరిచయం..పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై లైంగిక దాడి!
Nellore Crime : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ హీరోనంటూ పరిచయం చేసుకొని లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. పెళ్లి గురించి మాట్లాడితే.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు దిగాడు.
ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. ఆమె ప్రస్తుతం నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తూ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్నారు. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఫాలో అయ్యాడు. ఆమె పోస్టులను లైక్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెడుతూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. తాను సినీ హీరోనంటూ మాటలు కలిపాడు. అలా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో దగ్గరయ్యారు.
పరిచయం ప్రేమగా..
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మహిళ వద్ద సునీల్ రెడ్డి ప్రతిపాదించాడు. అప్పటికే భర్తను వదిలేసి సింగిల్‌గా ఉండటంలో మహిళ సునీల్ రెడ్డిని తనకు తోడుగా ఉంటాడని మహిళ భావించి సునీల్ రెడ్డి పెళ్లి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. పెళ్లి చేసుకుంటానని అనడంతో నమ్మిన ఆ మహిళ సునీల్ రెడ్డికి దగ్గరయింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 1 తేదీన మద్రాసు బస్టాండ్ వద్ద ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను లోబర్చుకున్నాడు.
రెండుసార్లు హోటల్‌కు..
మళ్లీ గతనెల 18న మరోసారి హోటల్‌కు తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఆమె వద్దంటున్నా లైంగిక దాడికి పూనుకున్నాడు. ఇలా తన లైంగిక వాంఛను తీర్చుకుంటున్నాడని భావించిన మహిళ.. పెళ్లి చేసుకోమని కోరింది. అయితే సునీల్ రెడ్డి వేర్వేరే కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నాడు. తన సినిమా సగంలో ఆగిపోయిందని, ఊరిలో ఉన్న ఆస్తిని బ్యాంకులో పెట్టి నగదు తీసుకురావాలని మహిళలపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమీరా అనడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది.
డబ్బులు డిమాండ్..
మళ్లీ మహిళ పెళ్లి చేసుకోమని కోరింది. ఆమె పెళ్లి గురించి అడిగితే, సునీల్ రెడ్డి డబ్బులు గురించి అడిగేవాడు. దీంతో ఆయనపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసేది. ఈ క్రమంలో డబ్బులు తేకపోతే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఇలా బెదిరించి ఆమె వద్ద నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఇటీవలి ఆమెపై సునీల్ రెడ్డి దాడి కూడా చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
పోలీసులకు ఫిర్యాదు..
మరోవైపు సునీల్ రెడ్డికి ఇదివరకే పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఆమెకు తెలిపింది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనపై లైంగిక, భౌతిక దాడి చేశాడని మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మహిళల పోలీసులను కోరింది. మహిళ ఫిర్యాదులో భాగంగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. నిందితుడి వివరాలు సేకరిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)