30years legal Fight: జీతం కోసం చిరుద్యోగి 30ఏళ్ల న్యాయపోరాటం..-a wage earner who fought in the courts for 30 years and won the case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  A Wage Earner Who Fought In The Courts For 30 Years And Won The Case

30years legal Fight: జీతం కోసం చిరుద్యోగి 30ఏళ్ల న్యాయపోరాటం..

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 12:44 PM IST

30years legal Fight: ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖలో చిరుద్యోగి, కాంట్రాక్టు ఉద్యోగిగా మూడున్నర దశాబ్దాల క్రితం విధుల్లో చేరిన మహిళ సర్వీసును మూడు దశాబ్దాల క్రితం క్రమబద్దీకరించినా వేతన చెల్లింపుకు మాత్రం 30ఏళ్ల నిరీక్షణ తప్పలేదు. చివరకు ఏపీ హైకోర్టు తీర్పుతో ఆమెకు న్యాయం జరిగింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

30years legal Fight: ఉద్యోగ సర్వీసును క్రమబద్దీకరించి 30ఏళ్లు గడిచినా వేతనం అందుకోవడానికి మాత్రం ఆ మహిళకు సుదీర్ఘ న్యాయపోరాటం తప్పలేదు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌, హైకోర్టు నడుమ పోరాటం తర్వాత చివరకు ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పు పట్టడంతో ఆమెకు న్యాయం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

సర్వీసు క్రమబద్ధీకరణ, జీతభత్యాల విషయంలో ఏళ్ల తరబడి సాగిన న్యాయ పోరాటంలో ఓ మహిళా చిరుద్యోగి చివరకు విజయం సాధించారు. ఈ క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నాటి నుంచి మాత్రమేఅంటే 2009నుంచి ఆ మహిళా ఉద్యోగి నోషనల్‌ పే పొందేందుకు అర్హురాలు అవుతుందని అధికారులు చేసిన వాదనను తోసిపుచ్చింది. 1993లో ఆమె తన సర్వీసు క్రమబద్ధీకరణ చేసినప్పటి నుంచి నోషనల్‌ పేకు అర్హురాలని స్పష్టం చేసింది. 30ఏళ్ళుగా ఆమెకు రావాల్సిన నోషనల్‌ పే బకాయిలకు సైతం అర్హురాలేనని తేల్చిచెప్పింది.

బాధితురాలికి అనుకూలంగా ట్రిబ్యునల్‌ గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని.. అధికారుల లోపం, నిర్లక్ష్యం వల్లే ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరిగిందని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారుల చేసిన తప్పులకు ఆ మహిళా ఉద్యోగికి చట్టప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది.

బాధితురాలైన మహిళకు అనుకూలంగా ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులు చట్టప్రకారమే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టు ఖర్చుల కోసం రూ.10 వేలను ఆమెకు చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ వెణుతురుమిల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

జీతం కోసం 30ఏళ్లుగా పోరాటం…

వైఎస్సార్‌ జిల్లా రాజంపేటకు చెందిన జి.పుల్లమ్మ 1986లో తాత్కాలిక ప్రాతిపదికన కడప చిల్డ్రన్‌ హోం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఆయాగా చేరారు. ఆ తర్వాత ఏడేళ్లకు 1994లో ప్రభుత్వం జీవో 212 జారీ చేసింది. జీవో ప్రకారం.. 1993కు ముందు తాత్కాలిక పద్ధతిలో నియమితులైన వారందరి పోస్టులను క్రమబద్ధీకరించాలని ఆదేశాలిచ్చింది.

ఈ జీవో ఆదారంగా పుల్లమ్మ సర్వీసును కూడా 1993 నుంచి క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొంటూ 1994లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆమెను రైల్వేకోడూరు చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో అటెండర్‌గా నియమించారు. అనూహ్యంగా 2001 జూన్‌ నుంచి ఆమెకు జీతం చెల్లించడం నిలిపేశారు. దీంతో పుల్లమ్మ జీతం కోసం ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ పుల్లమ్మకు జీతం చెల్లించాలంటూ 2003లో అధికారులను ఆదేశించింది. ఇది జరిగి 20ఏళ్లు అవుతోంది.

ట్రిబ్యునల్ ఆదేశించినా అధికారులు పుల్లమ్మకు జీతం చెల్లించలేదు. 1994లో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా ఆమె ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించారని పేర్కొంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. దీన్ని పుల్లమ్మ 2004లో మరోసారి ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేశారు.

తీర్పులకు స్పందించని అధికారులు….

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌.. సర్వీసు క్రమబద్దీకరణ విషయంలో ఆమె పెట్టుకున్న దరఖాస్తుపై తగిన నిర్ణయం వెలువరించాలని 2006లో అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆమె సర్వీసు క్రమబద్ధీకరణ విషయాన్ని పక్కన పెట్టి, జీతాన్ని రూ.3,850గా సవరించి, 2005 నుంచి బకాయిలు చెల్లిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు.

తన ఉద్యోగం క్రమబద్దీకరణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పులమ్మ 2006లోనే ట్రిబ్యునల్‌లో మరో పిటిషన్‌ వేశారు. దీంతో అధికారులు ఆమె జీతాన్ని 2003 నుంచి చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే తాను 1993లో నియామకం జరిగిందని, అప్పటి నుంచి సవరించిన జీతాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పుల్లమ్మ 2007లో మరోసారి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

పుల్లమ్మ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ ఆమె సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేయడంతో దిగొచ్చిన అధికారులు ఆమె సర్వీసును క్రమబద్ధీకరిస్తూ 2009లో జీవో జారీ చేశారు.

దీంతో ఆమె 2010లో సేవిక పోస్టులో నియమితులయ్యారు. అయితే ఆమెకు చెల్లించాల్సిన ఇతర ప్రయోజనాల విషయంలో మాత్రం అధికారులు స్పందించలేదు. దీంతో ఆమె 1994 నుంచి తనకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ చెల్లించేలా అధికారులను ఆదేశించాలంటూ 2010లో ట్రిబ్యునల్‌ లో మరో పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ 1993 నుంచే పుల్లమ్మ సర్వీసును క్రమబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను సవరించాలని అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అధికారులు హైకోర్టులో 2013లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విన్న ధర్మాసనం అధికారులు పుల్లమ్మ సర్వీసు క్రమబద్ధీకరణ చేయకుండా 20ఏళ్లుగా జీతం చెల్లింపులో ఆమెను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదంటూ అధికారుల పిటిషన్‌ను కొట్టేసింది. బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది.

WhatsApp channel