Srikakulam Suicide: అమ్మనాన్నలను విడిచి హాస్టల్లో ఉండలేక…రిబ్బన్‌తో ఉరేసుకున్న పన్నెండేళ్ల బాలిక
Srikakulam Suicide: తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉండలేక ఏడో తరగతి చదువుకునే బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. హాస్టల్లో విడిచి వెళ్లిన గంటలోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాలిక కుటుంబంలో విషాదంలో నింపింది.
Srikakulam Suicide: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మనాన్నలను విడిచి ఉండలేక, జడ రిబ్బనుతో చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైటీసీలో కొనసాగుతున్న మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ స్కూల్‌లో సీతం పేట మండలానికి చెందిన బాలిక (12) ఏడో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు విడిచి పెట్టి ఉండలేక తనువు చాలించింది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను కుటుంబ సభ్యులు, బంధువులు, ఊర్లో తోటి స్నేహితులతో సంతోషంగా గడిపింది
దసరా సెలవులు పూర్తి అవ్వడంతో గురువారం ఆమె తల్లిదండ్రులు లావణ్యను స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తాను హాస్టల్‌లో ఉండనని, ఇంటికి వచ్చేస్తానని ఆమె మారం చేసింది. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో ఉండటానికి ఒప్పుకుంది. హాస్టల్‌లో ఉంటానని, అయితే నెలాఖరులో మళ్లీ రావాలని తల్లిదండ్రులను కోరింది. అందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే తల్లిదండ్రులకు హాస్టల్లో ఉంటానని మాటిచ్చినా ఏదో తెలియని ఆవేదనతో ఆ చిన్నారి ఉంది.
తల్లిదండ్రులను విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేదనకు గురైంది. తల్లిదండ్రులు హాస్టల్లో విడిచి వెళ్లిన గంట తరువాత మనస్తాపానికి గురైన విద్యార్థిని వసతి గృహంలోని గదిలోకి వెళ్లి జడ రిబ్బనుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భోజన విరామ సమయంలో ఆత్మహత్య చేసుకున్న బాలికను తోటి విద్యార్థులు గమనించి టీచర్ల, సమీపంలో ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే సిబ్బంది, ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన అప్పటికే వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఐటీడీఏ అధికారులు, కుటుంబ సభ్యులకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది. సీతంపేట ఐటీడీఏ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి, పాతపట్నం సీఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకుని, తోటి విద్యార్థులతో మాట్లాడి విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై ఆరా తీశారు. ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
చిన్నారి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల ఆసుపత్రి వద్దకు చేరుకుని రోధించారు. విద్యార్థిని స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు. దీంతో ఆ చిన్నారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)