Car Theft in Palnadu: ట్రావెల్స్‌ పెట్టడానికి కారు కొట్టేసి.. మొదటి చోరీలోనే దొరికిన దొంగ-a thief who stole a car to pay for travels and was caught in the first theft ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  A Thief Who Stole A Car To Pay For Travels And Was Caught In The First Theft

Car Theft in Palnadu: ట్రావెల్స్‌ పెట్టడానికి కారు కొట్టేసి.. మొదటి చోరీలోనే దొరికిన దొంగ

HT Telugu Desk HT Telugu
May 29, 2023 01:15 PM IST

Car Theft in Palnadu: లైఫ్‌లో త్వరగా ఎదిగిపోడానికి షార్ట్‌కట్ వెదుక్కున్న దొంగ మొదటి ప్రయత్నంలోనే పోలీసులకు దొరికిపోయాడు. అద్దె కారుతో ఉడాయించి ట్రావెల్స్ కంపెనీ పెట్టాలనుకున్న ప్రయత్నాలు ఫెయిలై కటకటాలు లెక్కిస్తున్నాడు.

కార్లు చోరీ చేసి ట్రావెల్స్ కంపెనీ పెడదామనుకున్న దొంగ దొరికిపోయాడు.
కార్లు చోరీ చేసి ట్రావెల్స్ కంపెనీ పెడదామనుకున్న దొంగ దొరికిపోయాడు. (unspalsh)

Car Theft in Palnadu: పల్నాడులో ఓ దొంగ చేసిన పని చూడ్డానికి కామెడీగా ఉన్నా చివరకు కటకటాల పాలయ్యాడు. ఎన్నాళ్లు పనిచేసినా జీవితంలో ఎదుగుబొదుగు లేదని భావించి కార్లు కొట్టేసి ట్రావెల్స్ కంపెనీ పెట్టాలని భావించాడు. అనుకున్నదే తడవుగా భారీ స్కెచ్ వేశాడు. ఖరీదైన లగ్జరీ కారును అద్దెకు తీసుకుని దాంతో ఉడాయించి రెండు రోజుల వ్యవధిలోనే పల్నాడు పోలీసులకు దొరికిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు

ట్రావెల్స్ కంపెనీ పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా కార్ల దొంగతనం చేసి కావాల్సిన వాహనాలు సమకూర్చుకోవాలని ప్లాన్ చేశాడు. మొదటి కారు దొంగతనంలోనే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

నిందితుడు సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారానికి చెందిన షేక్‌ మస్తాన్‌ వలిగా గుర్తించారు. నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

షేక్ మస్తాన్ వలి తాపీ మేస్త్రీగా పని చేసి కొంతకాలం క్రితం పని మానేశాడు. తర్వాత హైదరాబాద్‌లోని ఓ ట్రావెల్స్‌ సంస్థలో డ్రైవర్‌గా చేరాడు. తనకు కూడా ఓ ట్రావెల్స్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో తన వద్ద డబ్బులేకపోవడంతో కార్లు దొంగతనాలు చేయాలని భావించాడు. బొల్లారం నుంచి ఇద్దరు తాపీ పని చేసే వారిని మాట్లాడుకుని హైదరాబాద్‌లో పని ఉందంటూ తీసుకువచ్చాడు. వారిలో ఒకరి నుంచి ఫోన్ తీసుకుని ట్రావెల్స్ కార్ బుక్ చేశాడు.

విజయవాడలోని శైలజ ట్రావెల్స్‌లో వీఐపీలకు మాత్రమే కార్లు అద్దెకు ఇస్తారని తెలుసుకుని దొంగిలించిన ఫోన్ ద్వారా జస్ట్ డయల్‌కు ఫోన్ చేశాడు. వీ.ఎస్ రావు అనే పేరుతో ఈనెల 20వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రోజుకు రూ.8 వేల అద్దె చెల్లించేలా కారు బుక్ చేసుకున్నాడు. గన్నవరం నుంచి కారు బుక్ చేసుకోవడంతో ఆ ట్రావెల్స్‌ యజమానులు కారును షాజీత్ అనే డ్రైవర్‌తో పంపించారు. నిందితుడు మస్తాన్ వలిని గన్నవరంలో ఎక్కించుకున్న డ్రైవర్, నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. డ్రైవర్ షాజీత్‌కు రూ.1500 ఇచ్చి బిర్యానీ తీసుకు రమ్మని చెప్పడంతో డ్రైవర్ అక్కడే కారును ఉంచి రెస్టారెంట్‌లోకి వెళ్లాడు. నిందితుడు వెంటనే కారును దొంగిలించుకుపోయాడు.

ఈ వ్యవహారంపై ట్రావెల్స్ యజమాని యుగంధర్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నెంబర్, టెక్నాలజీ ఆధారంగా నిందితుడు షేక్ మస్తాన్ వలిగా గుర్తించారు. దొంగిలించిన కారు నెంబరును మార్చి హైదరాబాద్‌ నగరంలో తిప్పుతున్నాడని గుర్తించారు. హైదరాబాద్‌లో నిందితుడు మస్తాన్ వలిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన ఐదు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. ట్రావెల్ కంపెనీ సరైన సమాచారం లేకుండా అద్దెకు వాహనాలు పంపొద్దని ఎస్పీ హెచ్చరించారు.

WhatsApp channel