అమెరికాలో తెలుగు వైద్యుడిపై కాల్పులు...అక్కడికక్కడే మృతి!
అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యుడు రమేశ్‌బాబు (64) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసినప్పటికీ… స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేష్ బాబు మృతి చెందాడు. తుపాకీ కాల్పులు జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అయితే ఆయన మరణం ఆనుమానాస్పదంగానే ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. వైద్య సేవలకు గుర్తింపుగా అమెరికాలోని టస్కలసాలో ఒక వీధికి కూడా ఆయన పేరు పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే… తిరుపతి జిల్లా నాయుడు పేట మండలం మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేష్ బాబు (64) అనుమానాస్పద స్థితిలో మరణించారు. మేనకూరుకు చెందిన రైతు పేరంశెట్టి చినగురునాథంకి ముగ్గురు సంతానం. అందులో డాక్టర్ రమేష్ బాబు పెద్దవాడు. మేనకూరులోనే పదో తరగతి వరకు రమేష్ బాబు చదివాడు. తరువాత తిరుపతి ఎస్‌వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించాడు. గ్రాడ్యూషన్ పూర్తి చేసుకున్న రమేష్ బాబు పోస్టు గ్రాడ్యూషన్ కోసం విదేశాలకు వెళ్లాడు. జమైకాలో ఎంఎస్ పూర్తి చేశారు.
అనంతరం అమెరికా చేరుకుని వైద్యడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం అంతా అమెరికాలోనే స్థిరపడ్డారు. రమేష్ బాబు కరోనా సమయంలో విశేష సేవలందించారు. అందుకు గాను పురస్కారాలు కూడా అందుకున్నారు. తాను చదువుకున్న మేనకూరు ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళం ఇచ్చారు. అంతటి సేవా తత్పరుడుగా రమేస్ బాబు పేరు పొందాడు.
అంతేకాకుండా ఆయన స్వగ్రామం మేనకూరలో సాయిబాబా నిర్మాణానికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. ఈనెల 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన… అంతలోనే మృతి చెందారన్న వార్త కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తతో స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. అంతటి మంచి మనిషిని ఎందుకు హత్య చేశారని సన్నిహితులు బాధపడుతున్నారు.
రమేష్ బాబు మరణించాడని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. తిరుపతిలో నివాసం ఉంటున్న తమ్ముడు, తల్లి, నాయుడుపేటలో నివాసముంటున్న సోదరి అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించారు. ఆయన తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నప్పటికీ… ఘటన ఎలా జరిగిందో స్పష్టం కాలేదు.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం