Nara Lokesh Sports Ground: నారా లోకేష్ పేరుతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు.. ఎక్కడంటే?-a tdp sports ground in the name of nara lokesh was established at tadepalli near the chief ministers residence ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  A Tdp Sports Ground In The Name Of Nara Lokesh Was Established At Tadepalli Near The Chief Minister's Residence

Nara Lokesh Sports Ground: నారా లోకేష్ పేరుతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు.. ఎక్కడంటే?

ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఏర్పాటైన నారా లోకేష్ క్రీడాప్రాంగణం
ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఏర్పాటైన నారా లోకేష్ క్రీడాప్రాంగణం

Nara Lokesh Sports Ground:ముఖ్యమంత్రి ఇలాకాలో ప్రతిపక్షనాయకుడి కటౌట్లు కలకలం రేపాయి. సిఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారిపై టీడీపీ యువనేత పేరుతో భారీ ఫ్లెక్సీలతో క్రీడాప్రాంగణం వెలియడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Nara Lokesh Sports Ground: తాడేపల్లి సర్వీస్ రోడ్డులో అందరి దృష్టిని ఓ క్రీడా ప్రాంగణం ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే దారిలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వెంబడి ఉన్న ఖాళీ స్థలంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి బొమ్మలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దాదాపు రెండున్నర ఎకరాల స్థలంలో ప్రైవేట్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

తాడేపల్లిలో సిఎం నివాసానికి సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ స్థలాల్లో స్పోర్ట్స్‌ జోన్లు నాలుగైదు ఉన్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ గ్రౌండ్‌కు మాత్రం టీడీపీ యువనేత నారాలోకేష్‌ పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్‌ గ్రౌండ్ ఏర్పాటు రాజకీయ కారణాలతోనేనని స్పష్టమవుతోంది. ముఖ‌్యమంత్రి ఇలాకాలో ఉనికి కోసమే దీనిని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది.

సర్వీస్ రోడ్డు వెంబడి ఉన్న స్థలం ఎకరా రూ.40కోట్లు వరకు ధర పలుకుతోంది. ఈ ప్రాంతంలో గజం రూ.80వేల నుంచి లక్ష రుపాయల ధర పలుకుతోంది. విజయవాడ వైపు కంటే వారధికి ఇవతల గుంటూరు జిల్లా తాడేపల్లి వైపే నగరం ఎక్కువగా విస్తరిస్తోంది. జనావాసాలు గత పదేళ్లలో భారీగా పెరిగిపోవడంతో ఈ ప్రాంతంలో ప్రైవేట్ స్పోర్ట్స్‌ జోన్‌లు ఎక్కువయ్యాయి.

తాడేపల్లిలో నారా లోకేష్ పేరుతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం వ్యూహాత్మకమేనని ప్రచారం జరుగుతోంది. మంగళగిరిలో అసెంబ్లీ నియోజక వర్గంలో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ, ముందు తాడేపల్లిలో టీడీపీ జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది.

తాడేపల్లి ప్రాంతంలో ఇతర పార్టీల జెండాలను ఎగురవేసే పరిస్థితి లేకపోవడంతో పాటు సామాజిక కారణాలతో ఆ ప్రాంతంలో టీడీపీ ఉనికిని చాటుకోవడం కూడా టీడీపీకి సవాలుగా మారింది. ఇటీవల మహానాడు సందర్బంగా ముఖ్యమంత్రి నివాసానికి చేరువలో జాతీయ రహదారిపై టీడీపీ ఏర్పాటు చేసిన హోర్డింగులు రెండ్రోజుల వ్యవధిలోనే చినిగిపోయాయి.ఇవి చినిగిపోవడంపై టీడీపీ వర్గాల్లో అనుమానాలు కూడా ఉన్నాయి.

తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో వైసీపీ మినహా ఇతర పార్టీలు ఉనికి చాటుకోవడం సవాలుగా మారిందనే ఉద్దేశంతోనే టీడీపీ ఇలా దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజక వర్గం పరిధిలో వైసీపీ అభ్యర్ధిపై స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఓడిన చోటే గెలిచి తీరాలనే కసితో టీడీపీ ఉంది. అందుకే తాడేపల్లిలో ఉనికి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రైవేట్ స్థలాన్ని లీజుకు తీసుకుని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా, కార్యాలయాన్ని ఏర్పాటు చేసినా పోలీసుల నుంచి అభ్యంతరం వచ్చే అవకాశముండటంతో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దానికి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంగా పేరు పెట్టారు. వైసీపీ నేతల నుంచి కానీ ప్రభుత్వ వర్గాల నుంచి అభ్యంతరాలు రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో టీడీపీ ఉనికి చాటే ప్రయత్నం ద్వారా అధికార పార్టీకి సవాలు విసురుతున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు ఖరీదైన ఈ స్థలానికిభారీ మొత్తాన్ని లీజు చెల్లించడం ద్వారా స్థానికంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు ఓ వసతి ఏర్పాటు చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు తాడేపల్లి ప్రాంతంలో గత కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉంది. నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రాజధాని విశాఖ వెళ్లిపోతుందనే ప్రకటన తర్వాత అత్యధికంగా ఈ ప్రాంతమే ప్రభావానికి గురైంది.

ఈ ప్రాంతంలో సామాజికవర్గాల వారీగా అన్ని పార్టీలకు మద్దతుదారులున్నారు. రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే గ్రామాల్లో సైతం టీడీపీ బలంగానే ఉంది. వైసీపీ వ్యతిరేకించే వర్గం అండతోనే నారా లోకేష్ పేరిట తాడేపల్లిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఇందులో వాకింగ్ ట్రాకులు, క్రికెట్ నెట్‌ ప్రాక్టీస్ కోసం ఏర్పాట్లతో పాటు షటిల్ కోర్టుల్ని కూడా ఏర్పాటు చేశారు. తాడేపల్లి మీదుగా ప్రయాణించే వారి దృష్టిని ఆకర్షించేలా భారీ ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశారు. జనంలో చర్చ కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.

WhatsApp channel