Nellore : నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి జ‌ర్మ‌నీలో మృతి.. తల్లిదండ్రులకు అనుమానాలు-a student from nellore district dies of a heart attack in germany ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore : నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి జ‌ర్మ‌నీలో మృతి.. తల్లిదండ్రులకు అనుమానాలు

Nellore : నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి జ‌ర్మ‌నీలో మృతి.. తల్లిదండ్రులకు అనుమానాలు

HT Telugu Desk HT Telugu
Nov 23, 2024 12:41 PM IST

Nellore : నెల్లూరు జిల్లాల‌కు చెందిన యువ‌కుడు జ‌ర్మ‌నీలో గుండెపోటుతో మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అర్థంత‌రంగా చనిపోవడంతో.. త‌ల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఉన్న‌త చ‌దువుల కోసం జ‌ర్మనీ వెళ్లిన యువ‌కుడు ఇటీవ‌లి కార్ల కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అంతా బాగుంద‌నుకునే స‌మ‌యంలో చనిపోయాడు.

 ఉపేంద్ర రెడ్డి
ఉపేంద్ర రెడ్డి

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ప‌ట్ట‌ణం బీసీ కాల‌నీకి చెందిన సూరా రామ‌కృష్ణా రెడ్డి, నారాయ‌ణ‌మ్మ దంప‌తుల‌ కుమారుడు ఉపేంద్ర రెడ్డి (29). రామ‌కృష్ణారెడ్డి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. నారాయ‌ణ‌మ్మ కండ‌క్ట‌రుగా ఉద్యోగం చేస్తున్నారు. పిల్ల‌ల‌ను మంచిగా చ‌దివించాల‌నే ఆలోచ‌న‌తో విదేశాల‌కు పంపించారు. కుమార్తె ల‌క్ష్మీ భ‌వానీని అమెరికా పంపించాగా, నాలుగేళ్ల కిందట ఎంఎస్ చేసేందుకు ఉపేంద్ర రెడ్డి జ‌ర్మ‌నీ వెళ్లారు. చ‌దువు పూర్తి చేసిన ఆయ‌న‌ ఇటీవ‌లి అక్క‌డే కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మంచి ఉద్యోగంతో సంతోషంగా ఉంటూ ప్ర‌తి రోజు ఉద‌యం ఇంటికి ఫోన్ చేసేవాడు.

రెండు రోజులుగా తల్లిదండ్రులు అనేక సార్లు ఫోన్ చేసినా ఉపేంద్ర రెడ్డి స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అమెరికాలో చ‌దువుతున్న కుమార్తె ల‌క్ష్మీ భ‌వానీకి త‌ల్లి నారాయ‌ణ‌మ్మ ఈ విషయాన్ని చెప్పారు. ల‌క్ష్మీ భ‌వానీ త‌న అన్న ఉపేంద్ర రెడ్డి రూమ్‌లో ఉన్న స్నేహితుల‌కు ఫోన్ చేయ‌డంతో.. ఉపేంద్ర రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు తెలిపారు. కుమారుడు ఇక లేడ‌ని సమాచారం అందుకున్న త‌ల్లిదండ్రులు బ‌రువెక్కిన గుండెతో క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. జ‌ర్మ‌నీ నుంచి మృతదేహాన్ని తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

29 ఏళ్ల‌ వయస్సులోనే కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వాస్తవానికి ఉపేంద్ర‌ రెడ్డికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని త‌ల్లిదండ్రులు అంటున్నారు. చలాకీగా ఉండే ఉపేంద్ర రెడ్డి హార్ట్ ఎటాక్ తో మరణించాడంటే, నమ్మశక్యంగా లేదని విలపిస్తున్నారు. ఒకవేళ రెండు రోజుల కిందట మరణించి ఉంటే ఇప్పటివరకు తాము ఫోన్ చేస్తే స్నేహితులు ఫోన్ ఎందుకు ఆన్స‌ర్ చేయ‌లేద‌ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

త‌మ కుమారుడు మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయ‌ని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉపేంద్ర రెడ్డి మరణించాడన్న సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఉపేంద్ర‌ రెడ్డి తల్లిదండ్రులకి ఫోన్ చేసి పరామర్శించారు. వీలైనంత తొందరగా ఉపేంద్ర‌ రెడ్డి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని భరోసా నిచ్చారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner