Target Somu Veerraju : సోము వీర్రాజు ఎందుకు టార్గెట్ అయ్యారు….?-a section in andhra bjp targets somu veerrju and defames him ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  A Section In Andhra Bjp Targets Somu Veerrju And Defames Him

Target Somu Veerraju : సోము వీర్రాజు ఎందుకు టార్గెట్ అయ్యారు….?

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 01:03 PM IST

Somu Veerraju ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లక్ష్యంగా పత్రికల్లో కథనాలు రావడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. సోము వీర్రాజు పేరేమిటని ప్రధాని ప్రశ్నించారని, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయనే ప్రశ్నకు కూడా సోము తత్తర పడ్డారని కథనాలు వచ్చాయి. సోము వీర్రాజు వ్యతిరేకంగా కథనాలు రావడం వెనుక కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వచ్చింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Target Somu Veerraju ఏపీ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సాఫ్ట్ టార్గెట్‌గా మారారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సోము వీర్రాజు వ్యతిరేక వర్గాలకు ఆయన టార్గెట్‌ కావడం కొత్త కాకపోయినా ప్రధాని పర్యటనలో సోము వీర్రాజును పలుచన చేసే ప్రయత్నాల వెనుక కారణం ఏమిటనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు సోము వీర్రాజుకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. గత శనివారం ప్రధాని పర్యటన సందర్భంగా ఐఎన్‌ఎస్‌ చోళాలో జరిగిన సమావేశంలో ప్రధాని ఏపీలో జిల్లాలు ఎన్ని అడిగితే 21జిల్లాలని వీర్రాజు బదులిచ్చారని మిగిలిన నేతలు దానిని సరిచేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కోర్ కమిటీ భేటీలో ప్రధాని సోము వీర్రాజుని మీ పేరేమిటని ప్రశ్నించారని వార్తలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ రెండు వార్తల వెనుక సోము వీర్రాజుని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి కొంత మంది సోముతో పొసగడం లేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పేరు తెలియకుండానే బాధ్యతలు అప్పగిస్తారా అని సోము వర్గం ప్రశ్నిస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ప్రధానికి పరిచయం చేసింది కూడా సోము వీర్రాజే అని చెబుతున్నారు. సోము వీర్రాజు పేరేమిటని ప్రశ్నించకపోయినా కల్పితాలు ప్రచారం చేశారని, ఇతర నాయకుల్ని ప్రమోట్ చేసే క్రమంలో భాగంగానే సోము స్థాయిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిసక్తున్నారు.

సోము వీర్రాజుకు ప్రధాని అభినందనలు…!

ప్రధా‌ని పర్యటన సందర్భంగా బిజెపి కోర్ కమిటీతో గంటన్నర చర్చించారని, అదే రాత్రి ప్రెస్ మీట్లో ఆ వివరాలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారని ఎంపీ జివిఎల్ నరసింహరావు చెప్పారు. కోర్ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పరని, నీ కొన్ని పత్రికల్లో అక్కడ ఏదేదో జరిగిందని కొందర్ని టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారని ఆరోపించారు. సోము వీర్రాజుని మీ పేరేమిటి అని అడిగారని రాశారు, వీర్రాజును బలహీన పరచటానికి బురద చల్లటానికీ రాసిన ప్రయత్నమని ఆరోపించారు.

మోదీ వద్దకు వెళ్లిన వారు మొదట సంప్రదాయం ప్రకారం తమ పేర్లు హోదాలు చెబుతారని, అంతకు ముందు ఎయిర్‌పోర్టులో సోము వీర్రాజు స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్నారని, అలాంటి వ్యక్తిని పేరేమిటని ప్రధాని ఎందుకు ప్రశ్నిస్తారన్నారు.

పవన్ కల్యాణ్ ను మోదీ వద్దకు తీసుకు వెళ్లింది కూడా సోము వీర్రాజే అని, తాము కోరుకున్న నాయకుడికి అనుకూలంగా మసలటం లేదనే అసత్య రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. సోము వీర్రాజంటే పడదు కాబట్టి ఆయన‌ మీద ఊహించుకుని రాసేస్తున్నారని దుష్ప్రచారం చేసేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. .

నిజానికి పార్టీ కోర్‌ కమిటీలో ప్రధాని మోదీ సోము వీర్రాజుని మీరు ఏం చేస్తుంటారని అడిగితే _42 ఏళ్లుగా పార్టీకి అంకితం అయ్యానని వీర్రాజు చెప్పారని, నా మాదిరి గానేనా! అని మోదీ బదులిచ్చారని జివిఎల్ వివరించారు. ఇంత మంచి అభినందన‌ ఎవరికైనా లభిస్తుందా అన్నారు.

కోర్ కమిటీలో ముఖ్య నాయకులు ఎవరూ ఆగ్రహంగా మాటాడ లేదని. అది మా సంస్కృతి కాదని చెప్పారు. చక్కని వాతావరణంలో కోర్ కమిటీ సభ్యుల్లో చాలా మంది తమకు వచ్చిన ఆలోచనలు పంచుకున్నారని చెప్పారు. అక్కడ విమర్శలు చేయగలంత స్థాయి ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి దోహద పడేలా ప్రధాని యాత్ర సాగిందని స్పష్టత ఇచ్చారు.

సోము వీర్రాజు స్థానంలో మరొక నాయకుడిని అధ్యక్షుడిగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. కొందరికి అనుకూలంగా వ్యవహరించకపోవడంతో, రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీలో ఉంటూ ఇతర పార్టీల ప్రయోజనాల కోసం పని చేస్తున్న నాయకులను పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించిందని చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్