AP Crime News: ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకిన వివాహిత.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్-a married woman jumped into the harbor canal with her two children tata ace collided with an rtc bus ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Crime News: ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకిన వివాహిత.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్

AP Crime News: ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకిన వివాహిత.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్

HT Telugu Desk HT Telugu
Sep 30, 2024 08:29 AM IST

AP Crime News: భర్తతో విభేదాల నేపథ్యంలో విజయవాడలో వివాహిత ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకి గల్లంతైంది. మరో ఘటనలో గుంటూరులో ఆర్టీసీ బస్సును టాటా ఏస్‌ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

పెనుముడి వారధి వద్ద టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొన్ని ఆర్టీసీ బస్సు
పెనుముడి వారధి వద్ద టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొన్ని ఆర్టీసీ బస్సు

AP Crime News: విజ‌య‌వాడలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. భ‌ర్త‌తో గొడ‌వ కార‌ణంతో ఇద్ద‌రు చిన్నారులతో క‌లిసి త‌ల్లి విజ‌య‌వాడ బంద‌రు కాలువ‌లో దూకేసింది. దీంతో నాలుగు నెల‌ల చిన్నారి మృతి చెంద‌గా, మ‌రో కుమార్తె, త‌ల్లి కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఎన్‌టీఆర్ జిల్లా విజ‌య‌వాడ‌లోని రామ‌లింగేశ్వ‌ర్ న‌గ‌ర్ స్క్రూ బ్రిడ్జీ వ‌ద్ద ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా త‌ల్లి త‌న ఏడాదన్న‌ర‌ పాప‌, నాలుగు నెల‌ల చిన్నారితో క‌లిసి బంద‌రు కాలువ‌లో దూకింది. ఈ ఘ‌ట‌న‌లో నాలుగు నెల‌ల ప‌సికందు మృతి చెంద‌గా, త‌ల్లి, మ‌రో చిన్నారి గ‌ల్లంత‌య్యారు.

గుంటూరు శారదా న‌గ‌ర్‌కు చెందిన టి.తిరుప‌తి రావు రోజువారీ ప‌నుల‌కు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయ‌నకు భార్య సుధారాణి (23), జాస్వి (14 నెల‌లు), బ్లేసి (నాలుగు నెల‌లు) ఉన్నారు. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య త‌రుచూ గొడ‌వ‌లు జ‌రిగేవి. శ‌నివారం రాత్రి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆదివారం ఉద‌యం తిరుప‌తిరావు త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి విజ‌య‌వాడలోని కృష్ణ‌లంక క‌ళాన‌గ‌ర్ రెండో లైనులో నివాస‌ముంటున్న త‌న అన్న‌ కోటేశ్వ‌ర‌రావు ఇంటికి వ‌చ్చారు.

కృష్ణలంక‌లో మ‌ళ్లీ భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు అంద‌రూ ఇంటి వ‌ద్ద‌నే ఉన్నారు. తరువాత తిరుప‌తి రావు బ‌‌య‌టకు వెళ్లగా, సుధారాణి ఇద్ద‌రు చిన్నారుల‌ను తీసుకొని స్క్రూబ్రిడ్జి వ‌ద్ద‌కు చేరుకుంది. ముందుగా ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బంద‌రు కాలువ‌లో ప‌డేసింది. ఆ త‌రువాత సుధారాణి కూడా బంద‌రు కాలువ‌లో దూకేసింది. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట సీఐ ప‌వ‌న్ కిషోర్ సిబ్బందితో సహా వ‌చ్చి నాలుగు నెల‌ల బ్లేసిని వెలికి తీశారు.

చిన్నారి బ్లేసిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. కాలువలో నీటి ప్ర‌వాహం ఉధృతంగా ఉండ‌టంతో త‌ల్లితోపాటు పెద్ద పాప గ‌ల్లంతు అయ్యారు. గ‌ల్లంతైన ఇద్ద‌రి కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆదివారం రాత్రి వ‌ర‌కు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో గాలింపు చ‌ర్య‌లు వాయిదా వేశారు. సోమ‌వారం ఉద‌యం మ‌ళ్లీ గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తారు. సుధారాణి భ‌ర్త తిరుప‌తిరావును అదుపులోకి తీసుకొని, విచారిస్తున్న‌ట్లు ప‌ట‌మ‌ట సీఐ ప‌వ‌న్ కిషోర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో సుధారాణి కుటుంబ స‌భ్యులు, బందువులు రోద‌న‌లు మిన్నంటాయి.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం...

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆర్‌టీసీ బ‌స్‌ను టాటా ఏస్‌ ఢీకొన‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు క్ష‌త‌గ్రాతుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

గుంటూరు జిల్లా రేప‌ల్లె మండ‌లం పులిగ‌డ్డ పెనుమూడి వార‌ధి వ‌ద్ద చోటు చేసుకుంది. రేప‌ల్లె మండ‌లంలోని పెదఅర‌వ‌ప‌ల్లి గ్రామానికి చెందిన మాతంగి గంగాధ‌ర్ (42) పెద‌నాన్న వ‌ర్ధంతి ఆదివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన వారు, కొంద‌రు బంధువులు, కుటుంబ స‌భ్యులు మొత్తం ప‌ది మంది ఆహ్లాదంగా గ‌డిపేందుకు కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం మంగిన‌పూడి బీచ్‌కు గంగాధ‌ర్ సొంత టాటాఏస్ గూడ్స్ వెహిక‌ల్‌లో వెళ్లి సాయంత్రానికి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు.

పులిగ‌డ్డ పెనుమూడి వార‌ధి వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి చీరాల‌ నుండి మ‌చిలీప‌ట్నం వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సును వీరి అశోక్ లేలాండ్ టాటాఏస్ గూడ్స్ వెహిక‌ల్ ఢీకొట్టింది. టాటాఏస్ నుజ్జునుజ్జు అయింది. బ‌స్సు ముందు భాగంలో డ్రైవ‌ర్ వైప్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్ర‌మాదంలో టాటాఏస్ స్టీరింగ్ మ‌ధ్య‌లో న‌లిగి గంగాధ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

గాయ‌ప‌డిన దోనేపూడి రాజేష్ (ఊలుపాలెం), తండ్రి కూతుళ్లు గుర‌వ‌య్య, అమ్ములు (తెనాలి), గంగాధ‌ర్ మేన‌ల్లుడు శ్యామ్ (20, పెడ‌న‌), గంగాధ‌ర్ కుమార్తె, అల్లుడు దున్నా శ్రావ్య‌, క‌ల్యాణ్ బాబును అవ‌నిగ‌డ్డ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. గంగాధ‌ర్ భార్య‌, కుమారుడు ర‌త్న‌కుమారి, మ‌నోజ్‌, గంగాధ‌ర్ కుమార్తె సౌజ‌న్య (తెనాలి)ను రేప‌ల్లె ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. రేప‌ల్లె నుంచి క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌కాశం జిల్లాలో ట్రాక్ట‌ర్ బోల్తా...

ప్ర‌కాశం జిల్లాలో ట్రాక్ట‌ర్ బోల్తాపడింది. దీంతో 13 మంది వ్య‌వ‌సాయ కార్మికులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మ‌రి కొంద‌రికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఆదివారం ఒంగోలు-నంద్యాల రాష్ట్ర ర‌హ‌దారిపై మ‌ర్రిపూడి మండ‌లం అగ్ర‌హారం గ్రామం వ‌ద్ద చోటు చేసుకుంది. పొదిలి మండ‌లం కాటూరివారి పాలెం గ్రామానికి చెందిన 25 మంది మ‌హిళా కార్మికులు వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం చీమ‌కుర్తి మండలం కంభంపాడు గ్రామానికి వెళ్లి తిరిగి సాయంత్రం ట్రాక్ట‌ర్ ఎక్కి ఇంటికి బ‌య‌లు దేరారు.

అయితే ట్రాక్ట‌ర్ ఇంజిన్‌, ట్ర‌క్కు సంబంధించిన చింత‌కాయ విరిగిపోవ‌డంతో ట్ర‌క్కు అదుపు త‌ప్పి బోల్తా కొట్టింది. దీంతో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అగ్ర‌హారం గ్రామస్తులు 108 వాహ‌న సిబ్బందికి స‌మాచారం అందించ‌డంతో వాహ‌న సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను పొదిలి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)