MTM Repalle line: తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక,మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమం-a long standing wish of the coastal port residents the machilipatnam rapalle railway line has been paved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mtm Repalle Line: తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక,మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమం

MTM Repalle line: తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక,మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమం

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 01:37 PM IST

MTM Repalle line: మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. దశాబ్దాల బందరు వాసుల ఆకాంక్షలను నెరవేర్చి, ప్రజా రవాణాతో పాటు వాణిజ్య పరంగానూ లాభసాటిగా ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కొల్లు రవీంద్ర వినతి చేయడంతో, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ గురించి అశ్వినీ వైష్ణవ్‌కు వివరిస్తున్న కొల్లు రవీంద్ర
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ గురించి అశ్వినీ వైష్ణవ్‌కు వివరిస్తున్న కొల్లు రవీంద్ర

MTM Repalle line: బందరు ప్రజల దశాబ్డాల కోరిక అయినటువంటి మచిలీపట్నం - రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రిని కలిసి రైల్వే లైన్ ఏర్పాటు గురించి వినతిపత్రం అందించారు.

గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోనూ దశాబ్దాల ఈ ప్రాంత వాసుల కోరికైన రైల్వే లైను కోసం అధిక శ్రద్ధ పెట్టారు. మచిలీపట్నం దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగాల్లో కీలకంగా వ్యవహరించింది.

ఈ మార్గం పూర్తైతే.. చెన్నై - కలకత్తా మార్గంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, దూరం కూడా 100 కిలోమీటర్లకు పైగా తగ్గుతుందన్నారు. ప్రత్యేకంగా సరుకు రవాణా రైళ్లను విజయవాడ వైపు కాకుండా మచిలీపట్నం వైపుగా మళ్లించడం ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల పరిధిలోని ప్రజలకు ప్రయాణం సులువుగా మారుతుంది.

మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఎగుమతుల ద్వారా ఆదాయం కూడా ఆశించిన మేర లభిస్తుంది. ప్రత్యేకంగా మత్స్య ఎగుమతులు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి.

మరోవైపు.. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడుతున్న అమరావతి కూడా సమీపంలోనే ఉండడం వలన అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ఎక్కువగా జరగనున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో ఉండే పోర్టు కావడంతో ఈ రైల్వే లైనుకు ప్రాధాన్యం సంతరిస్తుంది. టూరిజం కూడా పెరిగే అవకాశాలున్నాయి. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా ఉన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటుకు ఉన్న ప్రాముఖ్యత అర్ధమైందని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ హామీ ఇచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తీర ప్రాంతంలో రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా ఉన్న ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.

తొలి దశలో మచిలీపట్నం - రేపల్లె లైన్ పూర్తి చేసి, మలి దశలో నర్సాపురంకు అనుసంధానించే ప్రణాళిక కూడా ఉందని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఈ మార్గం పూర్తి చేయడం ద్వారా తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.