Vijayawada Crime : విజయవాడలో దారుణం.. రూ.5 వేల కోసం భార్యను చంపిన భర్త
Vijayawada Crime : మద్యం మత్తు పేద కుటుంబాలను చిదిమేస్తోంది. మద్యానికి బానిసైన ఓ భర్త.. డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే చంపేశాడు. ఈ దారుణం విజయవాడ నగరంలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
విజయవాడ నగరం కంసాలిపేటకు చెందిన షేక్ బాజీ, నగీన(32)లకు 11 ఏళ్ల కిందట పెళ్లి అయ్యింది. వారికి ఓ బాబు ఉన్నారు. భర్త బాజీ పెయింటింగ్ పని చేస్తుండగా.. భార్య నగీన సమోసాల తయారీ కేంద్రంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాజీ మద్యానికి బానిస అయ్యాడు. పనికి సరిగా వెళ్లడం లేదు. అప్పులు చేస్తూ.. తాగుతున్నాడు. తరచూ డబ్బులు కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే.. బుడమేరు వరద వచ్చింది. అప్పటినుంచి బాజీ స్పిరిట్, సొల్యూషన్ తాగేందుకు అలవాటు పడ్డాడు. మళ్లీ తాగుదామంటే డబ్బులు లేవు. దీంతో నాలుగు రోజుల కిందట రూ.5 వేలు కావాలని భార్యను అడిగాడు. ఆమె ఇవ్వలేదు. దీంతో గొడవ పడ్డాడు. ఇలా గొడవ జరుగుతున్న సమయంలో.. నగీన పక్కవీధిలో ఉండే అక్క సాబీర దగ్గరకు వెళ్లింది.
నగీన పొద్దన పనికిపోయి.. సాయంత్రం పని అయిపోగానే అక్క దగ్గరకు వస్తుంది. ఈ నెల 21వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు పనికి వెళ్లి ఓ గంట విశ్రాంతి సమయం ఉండడంతో ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చింది. అప్పటికే మత్తులో ఉన్న బాజీ.. డబ్బుల కోసం మళ్లీ ఆమెతో గొడవపడ్డాడు. దీంతో నగీన తన సోదరికి ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయం చెప్పింది.
ఆందోళనతో నగీన అక్క ఇంటికి వచ్చింది. అంతలోనే ఉల్లిపాయలు కోసే కత్తితో బాజీ భార్య పీక కోసేశాడు. ఆమె రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందింది. సాబీర తన చెల్లి ఇంటికి వచ్చే చూసే సరికి కత్తితో రక్తం మరకలతో బాజీ బయటకు వచ్చాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన సోదరి కనిపించింది.
సాబీర కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చారు. అప్పటికే బాజీ పరారయ్యాడు. సాబీర కొత్తపేట పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి అక్క సాబీర ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు.