AP Lands Resurvey : భూముల రీసర్వేపై సందేహాలున్నాయా...? అయితే వెంటనే ఇలా చేయండి-a helpline number has been set up to resolve land re survey doubts in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lands Resurvey : భూముల రీసర్వేపై సందేహాలున్నాయా...? అయితే వెంటనే ఇలా చేయండి

AP Lands Resurvey : భూముల రీసర్వేపై సందేహాలున్నాయా...? అయితే వెంటనే ఇలా చేయండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 24, 2025 01:49 PM IST

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన సర్వేకు భిన్నంగా ప్రస్తుత సర్వే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా రైతులకు మరో అప్డేట్ ఇచ్చారు. రీసర్వే ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్‌ సర్వీస్ నెంబర్ ను తీసుకువచ్చారు.

ఏపీలో భూముల రీసర్వే
ఏపీలో భూముల రీసర్వే

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కొనసాగుతోంది. పక్కాగా భూముల లెక్కలను కొలుస్తూ రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే సర్కార్ భూముల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగా... ఇటీవలనే ప్రైవేట్, వ్యవసాయ భూములకు కూడా కొలతలు వేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు పర్యటిస్తున్నారు.

అందుబాటులోకి హెల్ప్‌లైన్‌ నెంబర్….

మరోవైపు ఈ భూముల రీసర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.రీసర్వే ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్‌ సర్వీస్ ను తీసుకువచ్చినట్లు ప్రకటించారు. ఇందుకోసం 814367922 నెంబర్ ను సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు. 

కేవలం భూ యజమానులే కాకుండా... సర్వే చేస్తున్న సిబ్బంది కూడా ఈ నెంబర్ ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. కేవలం పనిదినాల్లో మాత్రమే ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య ఈ నెంబర్ కు కాల్ చేయవచ్చు. 

భూ యజమానుల సమక్షంలోనే….

గతానికి భిన్నంగా ఈసారి భూ యజమానుల సమక్షంలోనే రీసర్వే చేస్తామని రెవెన్యూ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే.. క్షేత్రస్థాయిలో రీసర్వే చేస్తున్నారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడు సార్లు అవకాశం కల్పించనున్నారు.

కొలుతల సమయంలో యజమాని రాకుంటే… వీడియో కాల్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేయనున్నారు. యజమానుల సమక్షంలోనే భూములను రీసర్వే చేయాలని ఆదేశాలు రావటంతో.... సరికొత్త విధానంలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు కూడా ఛాన్స్ ఇవ్వనున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలుపుతున్నాయి.

బ్లాకుల వారీగా విభజన….

జనవరి 20వ తేదీ నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూముల్లో రీసర్వే చేపట్టారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గ్రామాన్ని బ్లాకులుగా విభజించారు. ప్రతి బ్లాక్ లో 250 ఎకరాలకు మించుకుండా చర్యలు తీసుకున్నారు.

ప్రతి బ్లాక్‌కు ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, ఒక వీఆర్‌ఏ ఉంటారు. ఈ బృందం సర్వే నంబర్ల ఆధారంగా భూముల యజమానులతో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి... ఈ గ్రూప్ ల ద్వారా ఎప్పకికప్పుడు సమాచారం అందిస్తోంది. గతంలో నిర్వహించిన సర్వేలో ఏకపక్షంగా సర్వే చేశారని..అనేక తప్పులు దొర్లాయని.. అలాంటి పరిస్థితి ప్రస్తుత సర్వేలో ఉండొద్దని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం