పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియాలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. గతేడాది డిసెంబర్ 30వ తేదీన బాలిక కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి.. ప్రియుడు మున్నా స్వస్థలం మోత్కూరుకు వెళ్లింది.
అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సదరు బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. అయితే బాలిక ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తన తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారని భావించిన బాలిక.. తల్లి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇలా అప్పుడప్పుడు మాట్లాడేది. తాను బాగానే ఉన్నానని, మున్నా అనే యువకుడిని ప్రేమించానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలిపింది. అంతేతప్ప ఆమె ఉంటున్న అడ్రస్ మాత్రం తల్లిదండ్రులకు చెప్పలేదు.
బాలికను ఆమె తల్లి పలుసార్లు అడ్రస్ అడిగినప్పటికీ ఆమె చెప్పేందుకు నిరాకరించింది. అయితే.. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బాలిక తన తల్లికి వీడియో కాల్ చేసింది. ఏడుస్తూ రూ.15 వేలు కావాలని అడిగింది. దీంతో తల్లి కూడా కన్నీరు పెట్టుకుంది. రూ.15 వేలు ఎందుకమ్మా అంటూ కూతురుని అడిగింది. బాలిక బదులిస్తూ.. మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా తనను కొట్టాడని తల్లికి తెలిపింది. తన కుమార్తెకు ఎంత కష్టం వచ్చిందని తల్లి ఆవేదన చెందింది.
ఈ క్రమంలో బాలిక తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ సూసైడ్ నోట్‌లో రాసి, అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతిరాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి మున్నా అనే యువకుడే కారణమని ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టాడని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ డి.నాగరాజు వివరించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)