Kakinada : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై ప్రేమ.. విద్యార్థినిని తీసుకెళ్లిపోయిన యువకుడు!
Kakinada : ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ యువకుడికి ఇంటర్ విద్యార్థినిని పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో విద్యార్థినిని యువకుడు తీసుకెళ్లిపోయాడు. జిల్లాలు వేర్వేరు కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అదికాస్త ఇంట్లో చెప్పకుండా యువకుడితో వెళ్లే వరకు వచ్చింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన కనపర్తి అశోక్ (22) కూలి పనులు చేస్తుంటాడు. పనుల కోసం ఏడాది కిందట కాకినాడ జిల్లాకు వచ్చాడు. ఈ క్రమంలో అశోక్‌కు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికతో పరిచయం ఏర్పడింది.
పరిచయం ప్రేమగా..
పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ, ఫోన్‌ల్లోనూ ఛాటింగ్ చేసుకోవడం, తరచూ మాట్లాడుకోవడం జరిగేది. ఈ నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి బాలికను ఎవరికి తెలియకుండా తీసుకెళ్లిపోయాడు. తన స్వగ్రామం మారెళ్లకు తీసుకెళ్లాడు. ఆ రాత్రి నుంచి కుమార్తె కనబడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. శుక్రవారం పెద్దాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా..
బాలిక కోసం పెద్దాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా మారెళ్లలో ఉన్నట్లు గుర్తించారు. పెద్దాపురం పోలీసులు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చేరుకున్నారు. ముండ్లమూరు ఎస్ఐ నాగరాజు సహకారంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. కనపర్తి అశోక్ ఇంట్లో బాలిక ఉన్నట్లు గుర్తించారు. అశోక్ ఇంటికి వెళ్లిన బాలికను పెద్దాపురం తీసుకొచ్చారు. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
పెళ్లి చేసుకుంటామని..
అయితే.. తామిద్దరం ప్రేమించుకున్నామని, తాము పెళ్లి చేసుకుంటామని బాలిక చెప్పినట్టు తెలిపినట్లు తెలిసింది. అందుకు బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. పోలీసులు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే బాలిక మైనర్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే.. అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేసినట్టు తెలిసింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ముమ్మరం చేసి.. ఒక రోజు వ్యవధిలోనే బాలికను తీసుకురావడంతో.. పెద్దాపురం పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)